డిప్యూటీ సీఎం కొడుకు కారు ఢీకొని రైతు మృతి

7 Jul, 2021 01:07 IST|Sakshi
యాక్సిడెంట్‌కు గురైన కారు–బైక్, పక్కన చిత్రంలో మంత్రి తనయుడు చిదానంద

సాక్షి, బెంగళూరు: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవది కుమారుడు ప్రయాణిస్తున్న కారు ఒక బైక్‌ను ఢీ కొట్టగా రైతు మరణించాడు. ఈ ఘటన బాగలకోటె జిల్లా హనగుంద తాలూకా కూడల సంగమ క్రాస్‌ వద్ద జాతీయ రహదారి– 50పై జరిగింది. లక్ష్మణ సవది కుమారుడు చిదానంద సవది స్నేహితులతో కలసి కారులో వెళ్తుండగా, ఎదురుగా పొలం పనులు చూసుకుని బైక్‌పై వస్తున్న రైతు కొడ్లప్ప హనుమప్ప బోళి (55)ని ఢీకొన్నారు. తీవ్రంగా గాయపడిన రైతును సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అక్కడ చనిపోయాడు. ప్రమాద సమయంలో కారులో 12 మంది ఉన్నట్లు తెలిసింది. ప్రమాదం తరువాత చిదానంద సవది వేరే కారులో పరారీ అయ్యారని స్థానికులు ఆరోపించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హనగుంద పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది. 

ఆ కారులో నా కొడుకు లేడు 
రోడ్డు ప్రమాదానికి కారణమైన కారులో తన కుమారుడు లేడని డీసీఎం లక్ష్మణ సవది చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌లో కూడా పేరు లేదని, ఏదీఏమైనా పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని తెలిపారు. గాయపడిన ఆ వ్యక్తిని తన కుమారుడే ఆస్పత్రిలో చేర్పించాడని చెప్పారు. తన కుమారుడు స్నేహితులతో అంజనాద్రి ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. కాగా, చిదానందను రక్షించాలంటూ తమపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని ఎస్పీ తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు