బాప్‌రే.. రేవ్‌ పార్టీలో మహిళా పోలీసు 

19 Apr, 2021 19:07 IST|Sakshi

యశవంతపుర: చట్టాన్ని కాపాడాల్సినవారే అతిక్రమించారు. కర్ణాటకలో హాసన్‌ జిల్లాలో జరిగిన రేవ్‌ పార్టీలో కొందరు పోలీసులు కూడా మజా చేసినట్లు సమాచారం. ఇటీవల ఆలూరు తాలూకాలో ఒక రిసార్టులో పెద్దఎత్తున రేవ్‌ పార్టీ జరిగింది. ఇది తెలిసి పోలీసులు దాడి చేసి 130 మందిని అదుపులోకి తీసుకుని పదుల సంఖ్యలో కార్లను సీజ్‌ చేశారు. ఇందులో శ్రీలత అనే మహిళా పోలీసు కూడా ఉన్నారు. ఆమె మంగళూరు జిల్లాలో క్రైం విభాగంలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. రేవ్‌ పార్టీలో పాల్గొనడానికి సెలవు పెట్టి వచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీలతను సస్పెండ్‌ చేసినట్లు మంగళూరు నగర పోలీసు కమిషనర్‌ ఎన్‌.శశికుమార్‌ తెలిపారు. మరికొందరు పోలీసులపై వేటు పడే అవకాశముంది. 

‘తన కుమారుడితో కలిసి ఆమె రేవ్‌ పార్టీకి వెళ్లారు. పోలీసులు సోదాలు జరిపినప్పుడు ఆమె తన అధికారాలను దుర్వినియోగం చేశారు. నగర క్రైం విభాగంలో పనిచేస్తున్నానని కూడా స్వయంగా చెప్పార’ని మీడియాకు కమిషనర్‌ శశికుమార్‌ వెల్లడించారు. కాగా, కరోనా భయంతో రాష్ట్రం అల్లాడుతుంటే కొంతమంది బాధ్యతారహితంగా జల్సాలు చేయడం పట్ల జనం మండిపడుతున్నారు. 


ఈనెల 10న ఆలూరు తాలూకా పరిధిలోని రిసార్ట్‌లో ఈ రేవ్‌ పార్టీ జరిగినట్టు తెలుస్తోంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారికిలో బెంగళూరు, మంగుళూరు, గోవా తదితర ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. మద్యం, నిషేధిత మత్తు పదారార్థాలతో పాటు 50 టూవీలర్లు, 20 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది వాహనాలపై అత్యవసర సర్వీసుల సిక్టర్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ద్వారా యువకులను రేవ్‌ పార్టీకి ఆహ్వానించారని, లోకేషన్‌ను చివరి నిమిషం వరకు గోప్యంగా ఉంచారని వెల్లడించారు. రిస్టార్‌ యజమాని గగన్‌ను అదుపులోకి తీసుకుని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అరెస్ట్‌ చేసిన వారి నుంచి రక్తనమూనాలు సేకరించామని, ఇంకా విచారణ కొనసాగుతోందని పోలీసులు చెప్పారు.

ఇక్కడ చదవండి:
కరోనా ఉగ్రరూపం; లాక్‌డౌన్‌ ఉండదన్నా సొంతూళ్లకు..

విజృంభిస్తున్న కరోనా:‌ కర్ణాటకలో నిమిషానికి 10 కొత్త కేసులు 

మరిన్ని వార్తలు