ఏమీ కాదు బాగానే ఉన్నా.. మగబిడ్డకు జన్మనిచ్చి.. అంతలోనే

3 Aug, 2021 07:38 IST|Sakshi

తుమకూరు/కర్ణాటక: ప్రసూతి కోసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణి వైద్యుల నిర్లక్ష్యానికి ప్రాణాలు కోల్పోయింది. జిల్లాలోని తిపటూరు పట్టణంలో ఉన్న ప్రైవేట్‌ నర్సింగ్‌ హోంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. వివరాలు.. కుందూరు గ్రామానికి చెందిన వ్యాపారి చేతన్‌ భార్య మమత (34)కు నెలలు నిండాయి. కాన్పు కోసం శనివారం ఉదయం జేనుకల్‌ నర్సింగ్‌హోంలో అడ్మిట్‌ చేశారు. సాధారణ కాన్పు అవుతుందని వైద్యులు చెబుతూ వచ్చారు. చివరకు సిజేరియన్‌ చేయాలని హడావుడిగా భర్త నుంచి సంతకాలు తీసుకుని శనివారం రాత్రి ఆపరేషన్‌ థియేటర్‌లోకి తీసుకెళ్లారు. ఏమీ కాదని, ధైర్యంగా ఉండాలని మమత భర్త, బంధువులకు ధైర్యం కూడా చెప్పింది.  

తల్లి మృత్యువాత  
గంట తరువాత నర్సులు మగబిడ్డను తండ్రి చేతిలో పెట్టి మీరు కింది అంతస్తులోకి వెళ్లండి అని చెప్పారు. కొంతసేపటికి మమత మృతదేహాన్ని అప్పగించడంతో భర్త, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. పుట్టిన క్షణమే తల్లిని కోల్పోయిన బిడ్డను చూసి వారి దుఃఖం కట్టలు తెంచుకుంది. వైద్యులు ఉదయాన్నే స్పందించి ఉంటే ఆమె ప్రాణాలు దక్కేవని భర్త, బంధువులు విలపించారు. సిజేరియన్‌ వికటించి రక్తపు వాంతులు చేసుకున్నట్లు తెలిసిందన్నారు. ఆదివారం ఆస్పత్రి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. వైద్యుల నిర్లక్ష్యంపై తిపటూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.  

మరిన్ని వార్తలు