కోవిడ్‌తో భర్త మృతి.. ముగ్గురు కూతుళ్లతో కలిసి పుట్టింటికి వెళ్తున్నానని..

30 Sep, 2021 08:43 IST|Sakshi

తల్లి, చిన్నకూతురు మృత్యువాత 

కోవిడ్‌కు భర్త బలి,వెంటాడిన అప్పులు 

సాక్షి, బళ్లారి: కోవిడ్‌ రక్కసి కాటుకు ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. కరోనాకు కుటుంబ పెద్ద బలి కావడంతో, నలుగురు ఆడపిల్లల్ని పోషించలేక ఓ తల్లి పిల్లలతో కలిసి నదిలో దూకింది. ఈ సంఘటనలో తల్లీ, చిన్న కూతురు మరణించగా, మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘోరం కర్ణాటకలోని గదగ్‌ జిల్లా రోణ తాలూకా హుళే ఆలూరు వద్ద బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉమాదేవి (40) అనే మహిళ భర్త నెల కిందట కోవిడ్‌తో కన్నమూశాడు.

ఆమెకు నలుగురు కూతుళ్లు కాగా, పెద్ద కూతురు గదగ్‌లో హాస్టల్లో ఉండి ఇంటర్‌ చదువుతోంది. భర్త చనిపోయినప్పటి నుంచి తీవ్రంగా కుంగిపోయింది. ఆమెకు రూ. 7 లక్షల వరకూ అప్పులు ఉన్నట్లు తెలిసింది. పుట్టింటికి వెళ్తున్నానని ఇరుగుపొరుగుకు చెప్పి ముగ్గురు కూతుళ్లను తీసుకుని తెల్లవారుజామునే వెళ్లిపోయి సమీపంలోని మలప్రభ నదిలోకి దూకింది. సమీపంలో ఉన్న వ్యక్తులు హుటాహుటిన నదిలోకి దూకి 12, 14 ఏళ్ల ఇద్దరు బాలికల్ని కాపాడారు, కానీ ఉమాదేవి, 8 ఏళ్ల చిన్నకూతురు నదిలో కొట్టుకుపోయి మృతి చెందారు.

చదవండి: అంతా బాగానే ఉంది.. ఆరేళ్లుగా సహజీవనం చేసి చెప్పకుండానే..

     

మరిన్ని వార్తలు