Lingayat Seer Suicide: కర్ణాటకలో మరో మఠాధిపతి ఆత్మహత్య.. బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని సూసైడ్‌ నోట్‌

25 Oct, 2022 15:13 IST|Sakshi

సాక్షి, బెంగళూరు:​ కర్ణాటకలో మరో మఠాధిపతి ఆత్మహత్య కలకలం రేపుతోంది. రామనగర జిల్లా మగాడి తాలుకా కెంపుపురా గ్రామంలోని శ్రీ కంచుగల్‌ మఠానికి చెందిన 45 ఏళ్ల బసవలింగ స్వామి సోమవారం ఉదయం శవమై కనిపించారు. ఆశ్రమం ఆవరణంలోని పూజా గది కిటికీ గ్రిల్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రోజూ ఉదయం 4 గంటలకే నిద్ర లేచే స్వామి 6 గంటల వరకు లేవకపోవడం, పూజ గది తలుపులు మూసి ఉండటంతో అనుమానం వచ్చిన సిబ్బంది తలుపులు పగలగొట్టి చూడగా.. సాధువు మరణం బయటపడింది.

సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా బసవలింగ స్వామి 400 ఏళ్ల చరిత్ర కలిగిన కంచుగల్‌ మఠానికి 1997లో ప్రధానపీఠాధిపతిగా నియామకయ్యారు. అప్పటి నుంచి (25 సంవత్సరాల పాటు) ఈ మఠానికి ఆయనే అధిపతిగా కొనసాగుతున్నారు. కొన్ని నెలల క్రితం రజతోత్సవాన్ని సైతం జరుపుకున్నారు.

స్వామిజీ వద్ద రెండు పేజీల సూసైడ్‌ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనను మఠాధిపతి నుంచి తొలగించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. వ్యక్తిత్వాన్ని తప్పుబడుతూ వేధింపులకు గురిచేస్తున్నారని.. బెదిరింపులకు పాల్పడుతున్న వారి పేర్లు కూడా ఆ నోట్‌లో స్వామీజీ రాసినట్లు సమాచారం. అయితే బ్లాక్‌మెయిల్‌ కారణంగానే మఠాధిపతి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది.

ఇదిలా ఉండగారెండు నెలల క్రితం బెల్గాంలోని శ్రీ గరు మడివళేశ్వర మఠంలోని బసవ సిద్ధలింగ స్వామి మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. లింగాయత్ మఠంలో లైంగిక వేధింపులకు సంబంధించిన ఆడియోలో తన పేరు రావడంతో స్వామీజీ కలత చెంది ఉంటాడని అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి.
చదవండి: మరదలిపై పోలీసు అత్యాచారం.. అయిదుసార్లు అబార్షన్.. 

మరిన్ని వార్తలు