కత్తులతో దాడి చేసి యువకుడి దారుణ హత్య.. అంతా చూస్తుండగానే..!

4 Sep, 2022 15:47 IST|Sakshi

భోపాల్‌: పాత పగలతో హక్కుల పోరాట విభాగం కర్ణీ సేనాకు చెందిన 28 ఏళ్ల యువకుడిని కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. అంతా చూస్తుండగానే కత్తులతో పలుమార్లు పొడిచారు. ఈ సంఘటన గత శుక్రవారం రాత్రి మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో జరిగింది. ఇటార్సిలోని కర్ణీ సేనా టౌన్‌ సెక్రెటరీ రోహిత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ను.. స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం ముందే ముగ్గురు దారుణంగా పొడిచారు. రోహిత్‌ను కాపాడేందుకు యత్నించిన ఆయన స్నేహితుడు సచిన్‌ పటేల్‌పైనా కత్తులతో దాడి చేశారు. రక్తపు మడుగులో పడివున్న ఇరువురిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే రాజ్‌పుత్‌ ప్రాణాలు కోల్పోగా.. పటేల్‌ పరిస్థతి విషమంగా ఉంది. 

పాత పగలతోనే రోహిత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ను హత్య చేసినట్లు ఇటార్సి పోలీస్‌ స్టేషన్‌ ఇంఛార్జ్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌ తెలిపారు. ప్రధాన నిందితుడు 27 ఏళ్ల రాను అలియాస్‌ రాహుల్‌గా చెప్పారు. ‘బాధితుడు, అతడి స్నేహితుడు మార్కెట్‌లోని ఓ టీ షాప్‌ ముందు నిలుచుని ఉన్నారు. బైక్‌లపై ముగ్గురు వ్యక్తులు అక్కడికి వచ్చారు. వారితో గొడవకు దిగారు. ఈ క్రమంలోనే అందులోని ఓ వ‍్యక్తి కత్తి తీసి రాజ్‌పుత్‌పై దాడి చేశాడు. ముగ్గురు నిందితులు రాహుల్‌ రాజ్‌పుత్‌, అంకిత్‌ భట్‌, ఐషు మాలవియాలను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచాం.’ అని తెలిపారు ఎస్సై. 

కర్ణీ సేన సభ్యుడి హత్య నేపథ్యంలో నిందితుల్లో ఒకడైన అంకిత్‌ భట్‌ నివాసాన్ని అధికారులు కూల్చేసినట్లు స్థానికులు తెలిపారు. మిగిలిన ఇద్దరి ఇళ్లను సైతం కూల్చేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలిసింది. అదే ప్రాంతంలో ఐదు రోజుల క్రితం ఓ బ్యాంకు ఉద్యోగిపై ఐదుగురు దుండగులు దాడి చేశారు. దీనిపై మాజీ స్పీకర్‌, బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్‌ సితాశరన్‌ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి: ఎంత పని చేశావు తల్లీ! తన కొడుకుకంటే ఎక్కువ మార్కులు వచ్చాయని..

మరిన్ని వార్తలు