వందల మంది షేర్లు మాయం! 

24 Aug, 2021 01:13 IST|Sakshi

డీమ్యాట్‌కు లింకైన ఖాతాల్లోని నగదు కూడా 

కార్వీ స్కామ్‌లో వెలుగులోకి కొత్త విషయాలు 

సీసీఎస్‌ను ఆశ్రయించిన 25 మంది బాధితులు 

పార్థసారథి కస్టడీపై నేడు న్యాయస్థానం నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (కేఎస్‌బీఎల్‌) సంస్థలో డీమ్యాట్‌ ఖాతాలు కలిగిన మదుపరుల షేర్లు భారీ సంఖ్యలో గల్లంతయ్యాయి. దీంతోపాటు డీమ్యాట్‌ ఖాతాలకు లింకై ఉన్న బ్యాంకు ఖాతాల్లోని నగదు కూడా మాయమైంది. కేఎస్‌బీఎల్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సి.పార్థసారథిని హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైం స్టేషన్‌ (సీసీఎస్‌) పోలీసులు గత గురువారం అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న బాధితులు అనేక మంది అధికారులను సంప్రదిస్తున్నారు.

సోమవారం నాటికి 25 మంది వచ్చారని సమాచారం. నిబంధనల ప్రకారం ఈ ఠాణా అధికారులు రూ.75 లక్షల కంటే ఎక్కువ మొత్తంతో ముడిపడిన ఆర్థిక నేరాల కేసుల్నే నమోదు చేయాలి. అందుకే స్థానిక పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచించినట్లు ఓ అధికారి తెలిపారు. రెండు బ్యాంకులకు రూ.484 కోట్లు ఎగవేసిన ఆరోపణలపై సీసీఎస్‌లో వేర్వేరుగా మూడు కేసులు నమోదయ్యాయి. రూ.137 కోట్లకు సంబంధించి ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో పార్థసారథిని అరెస్టు చేసిన విషయంతెలిసిందే. తదుపరి విచారణ నిమిత్తం ఆయనను తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ సీసీఎస్‌ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం వాదనలు ముగిశాయి. దీనిపై న్యాయస్థానం మంగళవారం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

సంస్థలోకి మళ్లించుకుని రుణాలు.. 
కేఎస్‌బీఎల్‌ సంస్థ ఏళ్లుగా అనేక మంది మదుపర్ల డీమ్యాట్‌ ఖాతాలను పర్యవేక్షించింది. ఆయా ఖాతాల్లో వినియోగదారులకు సంబంధించిన షేర్లతో పాటు దానికి లింకైన బ్యాంకు ఖాతాల్లో నగదు కూడా ఉండేది. ప్రతి మదుపరుడు తన షేర్లను బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలకు తాకట్టు పెట్టడం ద్వారా వాటి విలువలో 80 శాతం వరకు రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని అనువుగా మార్చుకున్న పార్థసారథి మదుపరుల అనుమతి లేకుండా వారి డీమ్యాట్‌ ఖాతాల్లోని షేర్లను తన సంస్థ ఖాతాల్లోకి మార్చుకున్నారు.

ఆపై బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలను సంప్రదించి రుణాలు తీసుకున్నారు. మరికొందరి షేర్లను విక్రయించడంతో పాటు వారి బ్యాంకు ఖాతాల్లోని నగదునూ స్వాహా చేశాడు. ఇలా కేఎస్‌బీఎల్, కార్వీ కమోడిటీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలు దాదాపు 2 లక్షల మంది మదుపరుల ఖాతాల్లోని షేర్లు, నగదు మళ్లించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యాంకు ఫిర్యాదుతో నమోదైన కేసుల్ని దర్యాప్తు చేస్తున్నామని, అంగీకరించిన మదుపరులను ఈ కేసుల్లో సాక్షులుగా చేరుస్తామని సీసీఎస్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.   

మరిన్ని వార్తలు