‘అత్యాచారం చేసిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటా’.. సుప్రీంకోర్టుకు బాధితురాలు 

31 Jul, 2021 21:07 IST|Sakshi

దోషి రాబిన్ వ‌డ‌క్కుం చెర్రిని వివాహం చేసుకుంటా:  బాధితురాలు

సుప్రీంకోర్టును ఆశ్రయించిన బాధితురాలు

 సోమవారం విచారణ

న్యూఢిల్లీ: కేరళలోని వయనాడ్ జిల్లాలో పదహారేళ్ల బాలిక‌పై అత్యాచారం చేసి, బిడ్డకు జన్మనివ్వడానికి కారణమైన కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.  2016 లో మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిని కేసులో దోషిగా  తేలి,  20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్న క్యాథిలిక్ చ‌ర్చి ఫాద‌ర్‌ రాబిన్ వ‌డ‌క్కుం చెర్రీని వివాహం చేసుకోవడానికి అనుమతి కోరుతూ  బాధితురాలు శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

అంతేకాదు ఇది తన సొంత నిర్ణయమని, కేరళలోని కొట్టియూర్‌కు చెందిన బాధితురాలు పేర్కొంది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. ఈ అప్పీల్‌నుసుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. బాధితురాలిని పెళ్లి చేసుకుంటానంటూ కేరళ హైకోర్టులో రాబిన్‌ దాఖలు పిటిషన్‌ను తిరస్కరించిన  అయిదు నెలల  అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది. 

2016 లో రాబిన్‌ మైనర్‌ బాలిక‌ (16)ను లోబ‌ర్చుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆ బాలిక 2017లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 2017 ఫిబ్రవరిలో  రాబిన్ వ‌డ‌క్కుం చెర్రిన కొచ్చిలో అరెస్టు చేశారు. తనకు సంబంధం లేదని, తాను అమాయకుడిననీ రాబిన్ మొదట్లో బుకాయించాడు. కానీ డీఎన్‌ఏ టెస్టులో నిజాలు నిగ్గు తేలడంతో రెండేళ్ల తర్వాత అతడిని దోషిగా నిర్ధారించింది.  2019లో  రాబిన్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.  

అయితే జైలు శిక్ష అనుభ‌విస్తున్న రాబిన్‌  త‌న వల్ల బాధితురాలికి జ‌న్మించిన చిన్నారి సంరక్షణ బాధ్యతలను జైలు శిక్ష కారణంగా చూసుకోలేకపోతున్నానని, ఆమెను పెళ్లి చేసుకునేందుకు అనుమతించాలంటూ కేరళ హైకోర్టుకు లేఖ రాశాడు.  ఇందుకు  త‌న‌కు రెండు నెల‌లు బెయిల్‌ మంజూరు చేయాల‌ని కోరాడు. అయితే రాబిన్ ప్రతిపాద‌న‌ను కేరళ హైకోర్టు తిర‌స్కరించింది. శిక్షనుంచి తప్పించుకునేందుకు అతను ఈ ఎత్తుగ‌డ వేశాడని వ్యాఖ్యానించింది. అంతేకాదు దీనికి అంగీక‌రిస్తే ఇకపై ప్రతి అత్యాచార దోషి, శిక్షలు త‌ప్పించుకునేందుకు బాధితురాలిని పెళ్లి చేసుకుంటాననే అవ‌కాశం ఉంద‌ని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఇలాంటి సంప్రదాయ‌న్ని తాము ప్రోత్సహించ‌మ‌ని ధర్మాసనం ఈ ఏడాది ఫిబ్రవరిలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు