పాపం దేవానంద: ఐదు నెలల క్రితం తండ్రి! ఇప్పుడేమో కుళ్లిన షవర్మా తిని..

2 May, 2022 11:25 IST|Sakshi

ఓ ఫుడ్‌ కోర్టు సెంటర్‌ నిర్లక్ష్యం.. ఓ యువతి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా ఈ విషాదం నెలకొనగా.. మరికొందరు విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. కేరళలోని కాసరగాడ్‌ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
 
పదహారేళ్ల దేవానంద అనే అమ్మాయి.. చెరువథూర్‌ ఏరియాలో ఉంటోంది. ఏప్రిల్‌ 29వ తేదీన దగ్గర్లోని ట్యూషన్‌ సెంటర్‌కి వెళ్లి.. బ్రేక్‌ టైంలో అక్కడే ఉన్న జ్యూస్‌ కమ్‌ ఫుడ్‌ కోర్టు సెంటర్‌లో షవర్మా తినింది. అయితే.. ఆమెతో పాటు ఆ టైంలో షవర్మా తిన్న మరో 15 మంది విద్యార్థులకు వికటించింది. వాంతులు, విరేచనాలతో వాళ్లంతా ఆస్పత్రుల్లో చేరారు. ఈ క్రమంలో.. చికిత్స పొందుతున్న దేవానంద పరిస్థితి విషమించింది. ఆదివారం మధ్యాహ్నం ఆమె కన్నుమూసింది.  

మిగతా విద్యార్థుల పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన తర్వాత చెరువథూర్‌ ఏరియాలోని జ్యూస్‌ సెంటర్‌ని సీజ్‌ చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కుళ్లిపోయిన షవర్మా వాళ్లకు సర్వ్‌ చేయడం వల్లే ఈ ఘోరం జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటన తర్వాత రాష్ట్రంలోని ఫుడ్‌ కోర్టుల సేఫ్టీపై దృష్టిసారించాలని సంబంధిత మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించింది. 

ఇదిలా ఉంటే.. దేవానంద తండ్రి ఐదు నెలల కిందటే అనారోగ్యం సమస్యతో కన్నుమూశాడు. ఫుడ్‌ పాయిజన్‌ వల్లే ఆయన ఏడాదిన్నరగా మంచం పట్టి.. అలాగే కన్నుమూశాడు. దీంతో ఆ కుటుంబం తమ స్వగ్రామం నుంచి చెరువథూర్‌కి వలస వచ్చింది. ఇప్పుడు ఒక్కగానొక్క కూతురు దేవానంద.. ఫుడ్‌ పాయిజన్‌ బారిన పడి చనిపోవడంతో ఆ తల్లి గుండెలు పగిలేలా విలపిస్తోంది.

చదవండి: సాయిగణేష్‌తో నిశ్చితార్థమైన యువతి ఆత్మహత్యాయత్నం

మరిన్ని వార్తలు