చదువుకుంటారని ఫోన్‌ ఇస్తే.. పిల్లలు చేసిన పనికి తల్లి షాక్‌!

24 Jul, 2021 15:18 IST|Sakshi

తిరువనంతపురం: ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసైన పిల్లలు కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. ఆటల మోజులో పడి విద్యార్థులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు శారీరక, మానసిక వ్యాధులతో ఆస్పత్రులపాలైతే మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంకొందరు తల్లిదండ్రుల కళ్లుగప్పి డబ్బులను లూటీ చేస్తున్నారు. ఆటల మోజులో విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు.

ముఖ్యంగా కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ విద్యా సంస్థలు మూతపడి కేవలం ఆన్‌లైన్ విద్యా బోధన జరుగుతుండటంతో ఈ వైపరీత్యం మరింత ఎక్కువైంది. తాజాగా కేరళలోని ఓ ఘటన ఆన్‌లైన్‌ గేమ్స్‌ వల్ల తలెత్తే అనర్థాలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. కోజికోడ్‌లోని ఇద్దరు పిల్లలు ఆన్‌లైన్‌ క్లాసులు వినేందుకు ప్రతీరోజూ తన తల్లి స్మార్ట్‌ఫోన్‌ను తీసుకునేవారు. అయితే ఆన్‌లైన్‌ క్లాసులు సాకుతో పబ్‌జీకి గేమ్‌ అడిక్ట్ అయ్యారు.

ఎంతలా అంటే.. తమ తల్లికి తెలియకుండా బ్యాంకు ఖాతా నుంచి పబ్‌జీ మొబైల్ అకౌంట్ అప్‌గ్రేడ్, ఇన్-యాప్ కొనుగోళ్ల కోసం ఏకంగా రూ.లక్ష ఖర్చు చేశారు. అయితే ఈ విషయం తెలియని తల్లి తన ఖాతా నుంచి డబ్బులు కట్‌ అయ్యాయని.. కోజికోడ్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులును ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా ఇంటిదొంగల పని బయటపడింది. ఆమె పిల్లలే ఆ డబ్బులు విత్ డ్రా చేసినట్లు పోలీసులు గుర్తించారు. పబ్‌జి కోసం వారు ఈ డబ్బును పే చేసినట్లు కనుగొన్నారు. అసలు విషయం తెలిసి ఆ మహిళ  ఖంగుతిన్నది.

మరిన్ని వార్తలు