అందుకే ఆ షాపును జేసీబీతో కూల్చేశా..

28 Oct, 2020 13:10 IST|Sakshi

తిరునవంతపురం: అధికారులు తమ విన్నపాన్ని పట్టించుకోవడం లేదంటూ ఓ యువకుడు స్వయంగా తానే రంగంలోకి దిగాడు. పెళ్లి సంబంధాలు చెడగొడుతున్నారనే కోపంతో పొరుగింటి వ్యక్తి షాపును జేసీబీతో కూల్చివేశాడు. పైగా అక్రమ కార్యకలాపాలను అడ్డుకునేందుకే దానిని పడగొట్టాటని తన చర్యను సమర్థించుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాలు... కన్నూరు జిల్లాకు చెందిన 30 ఏళ్ల అల్బిన్‌ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇంట్లో వాళ్లు అతడికి ఇప్పటికే ఎన్నో సంబంధాలు చూసినా ఫలితం దక్కలేదు. దీంతో తమ పొరుగున షాపు యజమానే ఇందుకు కారణమని భావించిన అల్బిన్‌, అతడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని భావించాడు. (చదవండి: కేరళలో వివాదాస్పదంగా మారిన సంఘటన)

ఈ క్రమంలో సోమవారం జేసీబీతో  సదరు షాపును కూలగొట్టేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను, మలయాళ సినిమా అయ్యప్పనం కోశియంలోని రియల్‌ లైఫ్‌ సన్నివేశాల పేరుతో సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ‘‘ఈ షాపును వేదికగా చేసుకుని అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు. గ్యాంబ్లింగ్‌ ఆడుతున్నారు. మద్యం వ్యాపారం చేస్తున్నారు. నాలాంటి ఎంతో మంది యువకులకు ఇది అస్సలు నచ్చడం లేదు.

ఈ విషయం గురించి మేం ఎన్నోసార్లు పోలీసులకు, గ్రామ అధికారులకు ఫిర్యాదు చేశాం. కానీ ఎవరూ పట్టించుకోలేదు. అందుకే నేను ఆ షాపును కూల్చేశాను’’ అని చెప్పుకొచ్చాడు. అంతేగాక షాపు ఓనర్‌, తనకు వచ్చిన పెళ్లి సంబంధాలను చెడగొడుతున్నాడని పేర్కొన్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అల్బిన్‌ను అరెస్టు చేశారు. అతడి ఆరోపణల్లో నిజం లేదని, షాపు కూల్చివేసినందుకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఘటనపై లోతుగా విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా