భార్య బిడ్డల్ని కలవడం కోసం బస్సు దొంగిలించాడు

11 May, 2021 20:15 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కేరళలో చోటు చేసుకున్న ఘటన

తిరువనంతపురం: కరోనా కట్టడి కోసం దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ఎక్కడి వారు అక్కడే ఉండాలి. కదలడానికి వీలు లేదు. రవాణా సదుపాయాలు కూడా ఉండవు. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ వల్ల భార్యాబిడ్డల నుంచి వేరైన ఓ వ్యక్తి వారిని కలుసుకోవడం కోసం పెద్ద సాహసమే చేశాడు. బస్‌ స్టాప్‌లో ఆగి ఉన్న బస్‌ను దొంగిలించి మరి వారి వద్దకు చేరుకోవాలని ప్రయత్నించాడు. మరి కొన్ని గంటల్లో వారిని చేరతాననగా పోలీసులకు చిక్కాడు. విచారణలో అతడు చెప్పిన విషయాలు విని పాపం పోలీసులకు కూడా జాలేసింది. ఈ సంఘటన కేరళలో చోటు చేసుకుంది. 

ఆ వివరాలు.. కోజికోడ్‌కు చెందిన దినూప్‌(30) లాక్‌డౌన్‌ కారణంగా కుటుంబ సభ్యుల నుంచి వేరయ్యాడు. ప్రస్తుతం అతడి భార్య, బిడ్డలు పథనంతిట్ట జిల్లా తిరువల్లులో ఉండిపోయారు. వారిని చూడాలని ప్రాణం కొటుకులాడుతుంది. కానీ లాక్‌డౌన్‌ వల్ల ఎక్కడికి వెళ్లడానికి వీలు లేని పరిస్థితులు. ఏం చేయాలో అతడికి అర్థం కాలేదు. ఈ క్రమంలో దినూప్‌ తన ఇంటి సమీపంలో ఓ ప్రైవేట్‌ బస్‌ పార్క్‌ చేసి ఉండటం గమనించాడు. బస్‌కు సంబంధించిన వ్యక్తులెవరు అక్కడ లేకపోవడంతో ధైర్యం చేసి దానిలోకి ఎక్కాడు. ఇంధనం కూడా ఫుల్‌గా ఉంది. ఏది అయితే అది అవుతుంది అనుకుని ప్రయాణం ప్రారంభించాడు. 

కోజికోడ్‌ నుంచి తిరువల్లు 270 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నాలుగు జిల్లాలు దాటి వెళ్లాలి. లాక్‌డౌన్‌ కారణంగా పోలీసు పహారా కూడా బాగానే ఉంది. దాంతో రెండు సార్లు రాత్రి సమయంలో పోలీసులు అతడిని ఆపారు. ఎక్కడికి అని ప్రశ్నించారు. దానికి దినూప్‌ పథనంతిట్టలో వలస కార్మికులున్నారు.. వారిని తీసుకురావడం కోసం వెళ్తున్నాను అని చెప్పి.. అక్కడ నుంచి బయటపడ్డాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం అతడు పర్యాటకంగా బాగా ప్రసిద్ది చెందిన కుమారకోం వద్దకు చేరుకున్నాడు. అక్కడ పోలీసులు దినూప్‌ని ఆపి ఎక్కడని అడగ్గా గతంలో చెప్పిన కథే చెప్పాడు. 

అనుమానం వచ్చిన పోలీసులు లైసెన్స్‌ చూపించమని అడిగారు. దినుప్‌ ఇంట్లో మర్చిపోయాను.. తీసుకురాలేదని తెలిపాడు. దాంతో పోలీసులు బస్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఆధారంగా ఆర్‌టీవో వెబ్‌సైట్‌లో సర్చ్‌ చేయగా.. ఆ బస్‌ యజమాని పేరు, మొబైల్‌ నంబర్‌ తదితర వివరాలు వచ్చాయి. ఈ క్రమంలో పోలీసులు ఆర్టీఓ సైట్‌లో వచ్చిన నంబర్‌కు కాల్‌ చేయగా.. బస్‌ అసలు యజమాని కాల్‌ లిఫ్ట్‌ చేశాడు. అతడిని బస్‌ గురించి ప్రశ్నించగా.. ఆ బస్‌ తనదేనని.. కోజికోడ్‌ బస్‌ స్టాప్‌లో పార్క్‌ చేశానని తెలిపాడు. ఇక పోలీసులు జరిగిన తతంగం అంతా బస్‌ యజమానికి వివరించగా.. అతడు దినూప్‌ ఎవరో తనకు తెలియదని.. అతడు దొంగతనంగా తన బస్‌ వేసుకుని వెళ్లాడని పోలీసులకు తెలిపాడు. అనంతరం పోలీసులు దినూప్‌ని అదుపులోకి తీసుకుని బస్సును యజమానికి అప్పగించారు. 

చదవండి: ఛీ..ఛీ మీకిదేం పాడు బుద్ది

మరిన్ని వార్తలు