ఆభరణాల మోసం కేసులో కేరళ ఎ‍మ్మెల్యే అరెస్ట్‌

7 Nov, 2020 19:30 IST|Sakshi
ఎంసి కమరుద్దీన్‌(ఫైల్‌ ఫోటో)

తిరువనంతపురం : ఆభరణాల పెట్టుబడి మోసం కేసులో ఐయుఎంఎల్ ఎమ్మెల్యే ఎంసి కమరుద్దీన్‌ను శనివారం కేరళ పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. కాగా కమరుద్దీన్‌ కాసర్గోడ్‌ జిల్లాలోని మంజేశ్వర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో కమరుద్దీన్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఫ్యాషన్‌ గోల్డ్‌ జ్యువెల్లరీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ చాలామందిని ప్రభావితం చేసినట్లుగా తేలింది. కమరుద్దీన్‌పై ఉన్న నమ్మకంతో వందలాది మంది ఫ్యాషన్‌ గోల్డ్‌లో పెట్టుబడులు పెట్టారు.  అయితే గత జూలైలో వ్యాపారంలో ఆర్థికంగా నష్టంరావడంతో ఫ్యాషన్‌ గోల్డ్‌ బోర్డు తిప్పేసింది. కాగా కంపెనీలో పెట్టుబడి పెట్టిన వారికి కనీసం తమ వాటా కూడా రాలేదు. దీంతో మోసపోయామని భావించిన బాధితులు పోలీసులను ఆశ్రయించి ఎమ్మెల్యే కమరుద్దీన్‌తో పాటు సిబ్బందిపై కేసు నమోదు చేశారు.


కాగా కమరుద్దీన్‌పై 115 కి పైగా ఫిర్యాదులు వచ్చాయని పోలీసులు వెల్లడించారు. ఫిర్యాదులపై దర్యాప్తు కోసం రాష్ట్ర పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిందన్నారు. దీనిలో భాగంగానే సెక్షన్‌ 420 కింద కమరుద్దీన్‌ అరెస్ట్‌ చేసిన సిట్‌ బృందం శనివారం దాదాపు 5గంటల పాటు విచారణ చేసింది. కాగా అరెస్టు తరువాత వైద్య పరీక్షల నిమిత్తం కమరుద్దీన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మీడియాతో మాట్లాడిన ఆయన తన అరెస్ట్ రాజకీయంగా ప్రేరేపించబడిందని అన్నారు.

మరిన్ని వార్తలు