ఫేక్‌ సర్టిఫికెట్‌ కోసం బెదిరించడం నిజమే

15 Sep, 2021 02:07 IST|Sakshi
సీఐడీ కార్యాలయం లోపలికి వెళ్తున్న సాంబశివరావు

సీఐడీ అధికారుల ఎదుట ఒప్పుకున్న సాంబశివరావు!

ఫైబర్‌ నెట్‌ కుంభకోణం దర్యాప్తులో కీలక పురోగతి

నేడు వేమూరిని మరోసారి విచారించనున్న సీఐడీ  

సాక్షి, అమరావతి: ఫైబర్‌ నెట్‌ టెండర్ల కుంభకోణంపై విచారణలో సీఐడీ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ప్రధానంగా టీడీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహితులకు చెందిన టెరాసాఫ్ట్‌ కంపెనీకి టెండర్లను ఏకపక్షంగా కట్టబెట్టేందుకు ఫోర్జరీ పత్రాలు సమర్పించారనే విషయంలో కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. మొత్తం రూ.2 వేల కోట్ల విలువైన టెండర్ల కుంభకోణంలో మొదటి దశలో రూ.330 కోట్ల టెండర్లలో అవినీతిపై సీఐడీ ఇప్పటికే టెరాసాఫ్ట్‌ కంపెనీతో సహా 19 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా టీడీపీ ప్రభుత్వంలో ఇన్‌క్యాప్‌ ఎండీగా వ్యవహరించిన కె.సాంబశివరావు, ఇ–గవర్నెన్స్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ సీఐడీ అధికారుల వద్ద మంగళవారం విచారణకు హాజరయ్యారు.

విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో కె.సాంబశివరావును అధికారులు మొదట విచారించారు. రెండు దఫాలుగా దాదాపు ఐదు గంటలపాటు సాగిన ఈ విచారణలో సీఐడీ అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. కాగా టెరా సాఫ్ట్‌ కంపెనీకి టెండర్లు కట్టబెట్టడంలో తప్పులు జరిగాయని సాంబశివరావు ఒప్పుకున్నట్లు సమాచారం. టెరాసాఫ్ట్‌ కంపెనీ సమర్పించిన ఫోర్జరీ ఎక్స్‌పీరియన్స్‌ పత్రాలు, వాటికి సంబంధించిన డాక్యుమెంటరీ ఆధారాలను సీఐడీ అధికారులు ఆయన ముందుంచి వాటిపై విచారించారు. దాంతో టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగినట్టు ఆయన అంగీకరించాల్సి వచ్చిందని తెలిసింది.

ప్రశ్నల వర్షం..
టెండర్లలో పాల్గొనేందుకు అర్హత లేకపోయినప్పటికీ, సిగ్నం డిజిటల్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పేరిట ఫోర్జరీ పత్రాలు సమర్పించడం కచ్చితంగా తప్పేనని సాంబశివరావు అంగీకరించారని తెలుస్తోంది. ఆ విధంగా టెరాసాఫ్ట్‌ కంపెనీ సమర్పించిన ఫోర్జరీ పత్రాలు సరైనవే అని చెప్పమని సిగ్నం డిజిటల్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సీఈడీ గౌరీశంకర్‌ను బెదిరించడం నేరంగానే పరిగణించక తప్పదని కూడా ఆయన సమ్మతించారని సమాచారం. అదే విధంగా ఫైబర్‌ నెట్‌ టెండర్ల ప్రక్రియలో కేంద్ర మార్గదర్శకాలను పాటించక పోవడం, నాసిరకం పరికరాల సరఫరా, నిబంధనలకు విరుద్ధంగా బిల్లుల చెల్లింపులు తదితర అంశాలపై సీఐడీ అధికారులు ఆయన్ను ప్రశ్నించారని తెలుస్తోంది.

టెరాసాఫ్ట్‌ కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కట్టబెట్టడంలో కీలక సూత్రధారిగా భావిస్తున్న వేమూరి హరి కృష్ణ ప్రసాద్‌ను కూడా సీఐడీ అధికారులు కాసేపు విచారించారు. ఆయన్ను బుధవారం కూడా పూర్తి స్థాయిలో విచారించనున్నారు. ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న నిందితులు అందరినీ వరుసగా విచారించేందుకు సీఐడీ అధికారులు సమాయత్తమవుతున్నారు. కాగా, సీఐడీ కార్యాలయం వద్ద వేమూరి హరి కృష్ణ ప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ టెరా సాఫ్ట్‌ కంపెనీకి, తనకు సంబంధం లేదన్నారు. సీఐడీ అధికారులకు విచారణలో సహకరిస్తానని చెప్పారు.    

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు