బంగ్లాదేశ్‌ యువతిపై గ్యాంగ్‌ రేప్‌.. కీలక సమాచారం వెలుగులోకి

31 May, 2021 02:51 IST|Sakshi

ఉపాధి చూపుతామని ఢాకా నుంచి పిలిపించారు

గ్యాంగ్‌రేప్‌ బాధితురాలి వెల్లడి

సాక్షి, బెంగళూరు: బెంగళూరులో బంగ్లాదేశ్‌కు చెందిన యువతిపై గ్యాంగ్‌ రేప్‌ కేసులో విచారణలో కీలక సమాచారం వెలుగు చూసింది. నిందితులు బెంగళూరులో ఉపాధి చూపిస్తామని పిలిపించడంతో ఢాకా నుంచి వచ్చానని తెలిపింది. బాధిత యువతిని బెంగళూరు ఇందిరానగర పోలీస్‌స్టేషన్‌లో విచారించారు. తనపై చిత్రహింసలు జరిగిన మరుసటి రోజే కేరళకు వెళ్లిపోయానని యువతి చెప్పింది. అక్కడే తన ప్రియుడు ఉన్నాడని, దుండగుల భయంతో కేరళలో తలదాచుకున్నట్లు పేర్కొంది. ఇటీవల బెంగళూరులో కొందరు బంగ్లాదేశీ కూలీలు విందు చేసుకోగా... అందులో యువతిపై నలుగురు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడగా, ఇద్దరు మహిళలు సహకరించారు. ఆ వీడియోలు బయటకు రావడంతో గుట్టు రట్టయింది. నిందితులు సాగర్, రిదాయ్‌బాబు, మహమ్మద్‌ బాబాషేక్, హకీల్‌లను ఇదివరకే అరెస్టు చేశారు.  


తనకు తల్లిదండ్రులు లేరని, కుటుంబ బంధువులు కూడా ఎవరూ లేరని బాధితురాలు పోలీసులకు తెలిపింది. గతంలో తాను దుబాయ్‌లో డ్యాన్సర్‌గా పని చేసి ఢాకాకు వెళ్లిపోయినట్లు చెప్పింది. నిందితుల సూచనతో బెంగళూరుకు వచ్చానని తెలిపింది. డబ్బుల విషయంలో నిందితులతో గొడవ జరిగిందని, అత్యాచార సమయంలో మరో యువతి కూడా ఉన్నట్లు తెలిపింది. వీడియోలో రికార్డు అయిన దృశ్యాలకూ పోలీసులకు అందిన ఫిర్యాదులకు, యువతి చెప్పిన సమాధానాలకు పొంతన లేదని తెలుస్తోంది. మరో యువతి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

  చదవండి: (బెంగళూరులో బంగ్లాదేశ్‌ యువతిపై గ్యాంగ్‌ రేప్‌.. వీడియో వైరల్‌)

మరిన్ని వార్తలు