ఖమ్మంలో మరో ‘సూదిమందు’ హత్య

23 Sep, 2022 01:34 IST|Sakshi
 భార్య చేతికి ఇంజక్షన్‌ ఇస్తున్న భిక్షం (సీసీ ఫుటేజీ), హత్యకు గురైన నవీన (ఫైల్‌)

అధిక మోతాదులో మత్తు ఇచ్చిరెండో భార్యను చంపిన భర్త 

రెండో కాన్పులోనూ కూతురుకు జన్మనిచ్చిందని హత్య 

50 రోజుల తర్వాత వెలుగు చూసిన ఘటన 

తాజా ఘటనతోపాటు జమాల్‌ హత్యకు ఒకే ఆసుపత్రి నుంచి సూదిమందు సేకరణ

ఖమ్మం క్రైం: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి వద్ద ఇంజక్షన్‌ ఇచ్చి వ్యక్తిని హత్య చేసిన ఘటన మరవకముందే జిల్లాలో ఇదే తరహాలో మరో ఘటన వెలుగుచూసింది. 50 రోజుల క్రితం జరిగిన ఈ హత్య వివరాలను పోలీసులు తాజాగా బయటపెట్టారు. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం బొడ్రాయి తండాకు చెందిన తేజావత్‌ బిక్షం(42) ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. ఈయన మొదటి భార్య విజయకు సంతానం లేకపోవడంతో బయ్యారం మండలం జగ్గుతండాకు చెందిన నవీన(21) అలియాస్‌ సునీతను రెండోపెళ్లి చేసుకున్నాడు.

ఖమ్మం రూరల్‌ మండలం నాయుడుపేటలో నవీన, భిక్షం దంపతులు నివసిస్తున్నారు. నవీనకు తొలికాన్పులో కూతురు జన్మించింది. జూలై 30న ఖమ్మంలోని శశిబాల ఆస్పత్రిలో జరిగిన రెండో ప్రసవంలోనూ నవీన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వారసుడు కాకుండా ఇద్దరూ కూతుళ్లే జన్మించారనే కోపంతో నవీనను అదే ఆసుపత్రిలో హత్యచేయాలని భిక్షం ప్లాన్‌ వేశాడు. తాను పనిచేసే ఆరాధ్య ఆస్పత్రి నుంచి మత్తుమందు, ఇంజక్షన్‌ సేకరించాడు. నవీనకు సహాయకురాలిగా ఉన్న తల్లి మంగి నిద్రలోకి జారుకున్నాక భార్య చేతికి ఉన్న క్యాన్‌లాలోకి మత్తుమందును అధిక మోతాదులో ఎక్కించాడు. 


 భార్యను హత్యచేసిన భిక్షం   

నిద్రలోనే పరలోకాలకు.. 
అత్యధిక మోతాదు మత్తుమందు కారణంగా నవీన నిద్రలోనే మృతిచెందింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లే నవీన మృతి చెందిందంటూ భిక్షం తన బంధువులతో కలిసి ఆందోళనకు దిగాడు. దీంతో వైద్యులు రూ.5 లక్షల పరిహారం ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. నవీన మృతదేహానికి పోస్టుమార్టం లేకుండానే తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. అనంతరం నవీన మృతిపై ఆస్పత్రి యాజమాన్యం, ఆమె కుటుంబీకులు అనుమానించి సీసీ పుటేజ్‌ పరిశీలించగా ఆమె చేతి క్యాన్‌లాలోకి భిక్షం ఇంజక్షన్‌ ఎక్కిస్తున్న దృశ్యం బయటపడింది.

దీంతో ఖమ్మం టూటౌన్‌ పోలీసులకు తెలపగా తొలుత పట్టించుకోలేదు. ఐఎంఏ బాధ్యులు సీపీ విష్ణు ఎస్‌.వారియర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఆదేశాలతో భిక్షంను విచారించగా విషయం బయటపడింది. దీంతో బిక్షంను నెలన్నర క్రితమే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, తాజాగా జమాల్‌ను హత్య చేసిన ఘటనలో నిందితులకు ఖమ్మంలోని ఆరాధ్య ఆస్పత్రిలో పనిచేస్తున్న యశ్వంత్‌ మత్తు మందు సమకూర్చగా, ఇదే ఆస్పత్రిలో పనిచేస్తున్న భిక్షం అక్కడి నుంచే మందు తీసుకొచ్చి భార్యను హత్య చేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు