‘క్రిప్టో కరెన్సీ’ చేతికి రాలేదని.. ‘స్వాతీ.. పిల్లలు జాగ్రత్త.. అర్థం చేసుకో’

25 Nov, 2021 08:26 IST|Sakshi

సూర్యాపేటలో ఖమ్మం జిల్లా వాసి బలవన్మరణం

సాంకేతిక సమస్య వల్ల డబ్బులు ఆగిపోవడంతో అఘాయిత్యం 

సాక్షి, సూర్యాపేట క్రైం: క్రిప్టో కరెన్సీపై మదుపు చేసిన డబ్బులు సాంకేతిక కారణాలతో నిలిచిపోవడంతో ఖమ్మం జిల్లా వాసి ఒకరు సూర్యాపేట జిల్లా కేంద్రంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం పట్టణానికి చెందిన రామలింగ స్వామి (36), ఆనంద్‌ కిశోర్, నరేశ్‌ అనే వ్యక్తులతో కలసి క్రిప్టో కరెన్సీ యాప్‌లో రూ.10 లక్షలతో ట్రేడింగ్‌ చేశాడు. పెట్టిన పెట్టుబడి రెట్టింపు కావడంతో మరికొంత మందితో ఓ యాప్‌లో పెద్ద మొత్తంలో ట్రేడింగ్‌ చేయడంతో మొదట మూడు వారాలు లాభాలు వచ్చాయి. దీంతో మరింత భారీ పెట్టుబడి పెట్టడంతో లాభాలు రాగా డబ్బులు డ్రా చేద్దామనుకున్న సమయంలో సాంకేతిక సమస్యల కారణంగా డబ్బులు నిలిచిపోయాయి. 
చదవండి: హైదరాబాద్‌: తనువు చాలిస్తూ.. పలువురికి ఊపిరి పోశారు 

ఇన్వెస్టర్ల ఒత్తిడి.. 
పెట్టిన డబ్బులు చేతికి రాకపోవడంతో ట్రేడింగ్‌లో డబ్బులు పెట్టిన మదుపరులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ రామలింగ స్వామిపై ఒత్తిడి తీసుకు వచ్చారు. అంతేకాకుండా ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ఇటీవల రామలింగస్వామి కారును లాక్కెళ్లడంతో అవమానంగా భావించాడు. దీంతో మనస్తాపం చెందిన రామలింగ స్వామి మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ లాడ్జిలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం అతడి గది నుంచి దుర్వాసన రావడంతో లాడ్జి యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రామలింగస్వామి మృతిపై కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. 
చదవండి: ఇదో గమ్మత్తు కథ.. సీజ్‌ చేసిన గంజాయి ఎటు పోతుందో తెలుసా!

భారీగా పెట్టుబడి.. 
రామలింగ స్వామి క్రిప్టో కరెన్సీలో ట్రేడింగ్‌ కోసం భారీగా పెట్టుబడి పెట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మొదట ముగ్గురు స్నేహితులతో రూ.10 లక్షలతో మొదలు పెట్టగా వారంవారం లాభాలు రావడంతో మరికొంత మందితో కలిసి దాదాపు రూ.1.3 కోట్ల వరకు ఇన్వెస్ట్‌ చేసినట్టు వెల్లడించారు. పెట్టిన పెట్టుబడిలో రూ.60 లక్షలు తిరిగి రాగా రూ.70 లక్షల వరకు యాప్‌లో సాంకేతిక కారణాలవల్ల విత్‌ డ్రా చేసుకోవడం వీలుకాలేదని.. దీంతో రామలింగ స్వామిపై ఒత్తిడి పెరిగిందని పేర్కొన్నారు. 

స్వాతీ.. పిల్లలు జాగ్రత్త 
‘ఆన్‌లైన్‌ బిజినెస్‌లో లాసయ్యాను. నాతో పాటు చాలా మంది నష్టపోయారు. అంతేకానీ నేను ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. స్వాతీ.. పిల్లలు జాగ్రత్త. ఇలా చేయాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. కానీ, ఒత్తిడి తట్టుకోలేక ఇలా చేశాను. అర్థం చేసుకో’అంటూ సూసైడ్‌ లెటర్‌లో రామలింగ స్వామి భార్యనుద్దేశించి రాసినట్టు పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు