కిడ్నాప్‌ కలకలం.. ఆడ వేషంలో వచ్చి మరీ..

24 Jan, 2021 12:16 IST|Sakshi
చిన్నారి కిడ్నాప్‌నకు యత్నించిన వ్యక్తి

మెదక్‌ రూరల్‌: ఆడ వేషధారణలో వచ్చిన ఓ వ్యక్తి చిన్నారిని కిడ్నాప్‌ చేసేందుకు యత్నించిన సంఘటన అవుసులపల్లి గ్రామంలో శనివారం కలకలం రేపింది. గ్రామస్తులు, బాధిత కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అవుసులపల్లి గ్రామానికి చెందిన గంగ, బాలరాజు ఇంటి వద్దకు ఓ వ్యక్తి ఆడవేషధారణలో వచ్చి బియ్యం కావాలని యాచించాడు. దీంతో ఆ కుటుంబీకులు బియ్యం తీసుకొచ్చేందుకు ఇంట్లోకి వెళ్లిన క్రమంలో ఆరుబయట ఆడుకుంటున్న వారి ఎనిమిదేళ్ల చిన్నారి దివ్యను ఎత్తుకొని కిడ్నాప్‌కు ప్రయత్నించాడు. ఇది గమనించిన చిన్నారి తల్లి కేకలు వేయడంతో అప్రమత్తమైన గ్రామస్తులు నిందితుడిని పట్టుకొని చితకబాదారు.

దేహశుద్ధి చేసిన అనంతరం స్థానిక కార్యాలయ భవనంలో బంధించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలతో ఉన్న నిందితుడికి చికిత్స చేయించి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసుల విచారణలో మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం రామాయపల్లి గ్రామానికి చెందిన స్వామిగా గుర్తించారు. నిందితుడు ప్రైవేటు స్కూల్లో కరాటే టీచర్‌గా పని చేస్తున్నాడని.. మెదక్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించిన వదినను చూసేందుకు రెండు రోజుల క్రితం పట్టణానికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. డబ్బులు లేకపోవడంతో రెండు రోజులుగా భిక్షాటన చేస్తూ శనివారం ఉదయం అవుసులపల్లి గ్రామానికి మహిళా వేషధారణ దుస్తులు ధరించి వెళ్లినట్లు చెప్పాడు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించకపోవడం గమనార్హం. కిడ్నాప్‌ కలకలం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో చర్చనీయాంశమైంది.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు