హత్య కేసులో ఐపీఎస్‌ అధికారిపై వేటు

24 Jul, 2020 15:27 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌లో కలకలం సృష్టించిన ప్రైవేట్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ సంజీత్‌ యాదవ్‌ కిడ్నాప్‌, హత్య కేసులో పోలీసు డిపార్ట్‌మెంట్‌ నలుగురిని సస్పెండ్‌ చేసింది. వీరిలో ఐపీఎస్‌ అధికారి అపర్ణ గుప్తా కూడా ఉన్నారు. సంజీత్‌ యాదవ్‌ను గత నెల 22న కిడ్నాప్‌ చేసి రూ. 30లక్షలు ఇవ్వాల్సిందిగా నిందుతులు అతడి కుటుంబాన్ని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో జూలై 13న పోలీసుల సమక్షంలో కిడ్నాపర్లు అడిగిన మొత్తం చెల్లించామని.. అయినా సంజీత్‌ను వదిలివేయలేదని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు గురువారం ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. దర్యాప్తులో సంజీత్‌ యాదవ్‌ను గత నెల 26న చంపి, నదిలో పడేసినట్లు వెల్లడించారు. అయితే సంజీత్‌ కుటుంబ సభ్యులు మాత్రం ఓ నెల రోజుల నుంచి కిడ్నాపర్లు తమకు ఫోన్‌ చేస్తున్నారని.. రూ. 30లక్షలు ఇస్తే సంజీత్‌ని వదిలేస్తామని చెప్పినట్లు తెలిపారు. (‘హత్య చేసి నదిలో పడేశారు’)

ఈ క్రమంలో ఏరియా ఇన్‌చార్జ్‌ అపర్ణ గుప్తాను కలిసి కిడ్నాపర్లు డిమాండ్‌ చేసిన డబ్బును అందించామన్నారు. అంతేకాక డబ్బు సంచిన ఓ రైల్వేట్రాక్‌పై పడేశామని చెప్పారు. కానీ పోలీసులు కిడ్నాపర్లకు డబ్బు ముట్ట చెప్పి.. వారికి పారిపోయే అవకాశం ఇచ్చారని సంజీత్‌ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంతేకాక ఇంతవరకు సంజీత్‌ మృతదేహాన్ని కూడా కనుక్కోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరి వాదన ఇలా ఉండగా పోలీసులు మాత్రం ఆ సంచిలో డబ్బు లేదని వెల్లడించారు. అంతేకాక సంజీత్‌ కుటుంబ సభ్యులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు అపర్ణ గుప్తాతో పాటు మరో ముగ్గురిని సస్పెండ్‌ చేశారు. అంతేకాక ‘సంజీత్‌ కుటుంబ సభ్యులు కిడ్నాపర్లకు డబ్బు చెల్లించామని చెబుతున్నారు. కానీ ఇంతవరకు జరిగిన దర్యాప్తులో డబ్బు చెల్లించినట్లు తెలియలేదు. ఏది ఏమైనా కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. డబ్బు చెల్లించినట్లు తెలిస్తే.. వారికి అందజేస్తాం. ఈ కేసుతో మా డిపార్ట్‌మెంట్‌ అధికారులకు సంబంధం ఉన్నట్లు తెలిస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అన్నారు. (నటి కిడ్నాప్ ప్లాన్: ముఠా అరెస్టు)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా