రాహుల్‌ హత్య కేసు: పోలీసు కస్టడీకి కోగంటి సత్యం

2 Sep, 2021 14:05 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన వ్యాపారి కరణం రాహుల్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కోగంటి సత్యాన్ని గురువారం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కోగంటి సత్యాన్ని విజయవాడ సబ్‌జైలు నుంచి మాచవరం పీఎస్‌కు తరలించారు. కాగా పోలీసులు రాహుల్‌ హత్య కేసు విషయమై కోగంటి సత్యాన్ని నేడు, రేపు విచారించనున్నారు. ఇక ఈ హత్య కేసులో ఇప్పటివరకు 11 మందిని అరెస్ట్‌ అయ్యారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

రాహుల్‌ హత్యకు కారణాలివే..
కోరాడ విజయ్‌కుమార్, ఆయన స్నేహితురాలు గాయత్రి గత కొన్నేళ్లుగా కోరాడ చిట్‌ఫండ్‌ కంపెనీ నడుపుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో  విజయ్‌కుమార్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసి నష్టపోయిన  ఆయనపై అప్పులవాళ్లు తమ డబ్బు ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేయసాగారు. మరోవైపు చిట్‌ఫండ్‌ కంపెనీ డబ్బు సైతం ఎన్నికల్లో వినియోగించడంతో.. అక్కడా ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాహుల్, విజయ్‌కుమార్‌ భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న జిక్సిన్‌ సిలిండర్స్‌ కంపెనీలోని తన వాటా తీసుకుని డబ్బు ఇవ్వాల్సిందిగా విజయ్‌కుమార్‌  రాహుల్‌ను కోరాడు.

అయితే ఈ విషయంలో స్పందించకపోవడంతో రాహుల్‌పై ఆగ్రహంతో ఉన్నాడు. ఇదిలా ఉండగా విజయ్‌కుమార్‌ స్నేహితురాలు గాయత్రికి రాహుల్‌ రూ.6 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఆమెకు సైతం ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉంది. అలాగే జిక్సిన్‌ సిలిండర్స్‌ కంపెనీలో పనిచేస్తున్న సీతయ్యకు లాజిస్టిక్స్‌ బిజినెస్‌లో కాంట్రాక్ట్‌ ఇస్తానని హామీ ఇచ్చి నేరవేర్చకపోవడంతో రాహుల్‌పై కక్ష పెంచుకున్నాడు. ఈ పరిస్థితులే రాహుల్‌ హత్యకు దారితీశాయి.

చదవండి: రాహుల్‌ హత్య కేసు: మరో నలుగురు అరెస్ట్‌

రాహుల్‌ హత్యకేసు: వెలుగులోకి సంచలన విషయాలు

మరిన్ని వార్తలు