కోమా నుంచి బయటకు.. పదేళ్ల తర్వాత 

17 Oct, 2020 16:48 IST|Sakshi

బెంగళూరు : హత్యాయత్నం కేసులో ఇద్దరి నిందితులకు పదేళ్ల తర్వాత ఏడేళ్ల జైలు శిక్ష పడింది. బాధితుడు ఏడాది పాటు కోమాలోకి వెళ్లడం.. తర్వాత అసలు విషయం చెప్పడం.. విచారణ ఆలస్యం కావడంతో దాదాపు పదేళ్ల తర్వాత నిందితులకు ఏడేళ్ల శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాకు చెందిన శౌవిక్ ఛటర్జీ, అతని స్నేహితులు శశాంక్‌ దాస్‌ (అసోం), జితేంద్ర కుమార్‌(ఒడిశా) బెంగళూరులోని ఓ కళాశాలలో ఇంజనీరింగ్‌ చేశారు. ఆ సమయంలో ఓ యువతితో బాధితుడు ఛటర్జీ చనువుగా ఉండేవాడు. ఆ యువతినే దాస్‌ కూడా ఇష్టపడ్డాడు. ఈ క్రమంలో ఛటర్జీ అడ్డుతొలగించుకోవాలని దాస్‌ కుట్ర పన్నాడు. మరో స్నేహితుడు జితేంద్రతో కలిసి హత్యకు ప్లాన్‌ చేశాడు. ఛటర్జీని తమ ఇంటికి రప్పించారు. టెర్రస్‌ పైకి వెళ్లి మాట్లాడుకుందామని చెప్పి.. అక్కడకు వెళ్లగానే ఛటర్జీని కొట్టి కిందకు తోసేశారు. 2010 డిసెంబర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
(చదవండి : అమ్మ దొంగా! చిల్లర అడిగి మరీ..)

ఏడాది పాటు కోమాలోకి
తీవ్రంగా గాయపడిన ఛటర్జీ కోమాలోకి వెళ్లిపోయాడు. దాదాపు ఏడాది తర్వాత 2011 ఆగస్ట్‌లో ఛటర్జీ కోమా నుంచి బయటకు వచ్చి అసలు విషయం చెప్పారు. దీంతో బెంగళూరు పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు. 2012లో ఇద్దరు బెయిల్‌పై బయటకు వచ్చారు. అప్పటి నుంచి కేసు విచారణ కొనసాగుతూ వచ్చింది. దాదాపు పదేళ్ల తర్వాత కేసు విచారణ పూర్తయింది. నిందితులకు ఏడేళ్ల శిక్ష విధిస్తూ కోల్‌కతా కోర్టు తీర్పు వెలువరించింది. ప్రస్తుతం నిందితుల్లో ఒకడైన శశాంక్ దాస్ ఢిల్లీలోని ఓ ప్రయివేట్ బ్యాంకులో పనిచేస్తుండగా.. ఒడిశాకు చెందిన జితేందర్ కుమార్ బెంగళూరులోని ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

మరిన్ని వార్తలు