పబ్‌ యజమాని, మేనేజర్‌పై కేసు నమోదు 

4 Aug, 2021 16:21 IST|Sakshi
యజమాని సూర్యనాథ్‌, మేనేజర్‌ ‍ప్రాణేష్‌

సాక్షి, గచ్చిబౌలి(హైదరాబాద్‌): కొండాపూర్‌లో కారు పల్టీలు కొట్టి ఓ యువతి మృత్యువాత పడిన ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పబ్‌ యజమాని, మేనేజర్లపై 304 పార్ట్‌ సెక్షన్‌ నమోదు చేసి రిమాండ్‌ చేశారు. మద్యం సేవించిన వారు కారు నడుపుతూ వెళ్తే ప్రమాదమని తెలిసినప్పటికీ స్నార్ట్‌ పబ్‌ నిర్వాహకులు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయలేదని గచ్చిబౌలి సీఐ గోనె సురేష్‌ తెలిపారు. పబ్‌ యజమాని సూర్యనాథ్, మేనేజర్‌ ప్రాణేష్‌లతో పాటు మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేసిన అభిషేక్‌లపై 304 పార్ట్‌ 2 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. ముగ్గురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదిలా ఉంటే ఈ ఘటనంలో తీవ్రంగా గాయపడిన తరుణి, సాయి ప్రకాష్‌ల ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.


జీహెచ్‌ఎంసీలో కదలిక 
కారు పల్టీ కేసులో యువతి మృతి చెందిన కేసుతో జీహెచ్‌ఎంసీలో కదలిక మొదలైంది. కొండాపూర్‌లో స్కోడా కారు పల్టీ కొట్టిన ఘటనలో రోడ్డు పరిస్థితి అధ్వానంగా ఉందని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌ కుమార్‌ తీవ్రంగా స్పందించారు. దీంతో మంగళవారం శేరిలింగంపల్లి సర్కిల్‌– 20 ఈఈ సుదర్శన్, డీఈలు, శానిటేషన్‌ సిబ్బంది మై హోం మంగళ రోడ్డులో మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. రెండు లైన్ల రోడ్డు ముగిసిన నుంచి ఉన్న  సిమెంట్‌ రోడ్డుపై ఇసుక పేరుకు పోయిందని, రోడ్డు వెంట బండరాళ్ల డంప్‌తో పాటు వీధి దీపాలు తేకపోవడంతో మరిన్ని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ అధికారుల దృష్టికి తీసుకవచ్చారు. దీంతో మంగళవారం శానిటేషన్‌ సిబ్బంది రోడ్డుపై ఉన్న గుంతలను మట్టితో పూడ్చారు. ఇసుకను మిషన్‌తో తొలగించారు.

మరిన్ని వార్తలు