సీక్రెట్‌ యాప్‌తో భార్య ఫోన్‌ ట్యాపింగ్‌.. ఆమెపై నీడలా భర్త

3 Sep, 2021 12:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సీక్రెట్‌ యాప్‌.. చిచ్చు భర్తపై భార్య ఫిర్యాదు

విచారణ చేస్తున్న పోలీసులు

కోరుట్ల: సీక్రెట్‌ యాప్‌ను రహస్యంగా తన ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసి భర్త తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను అనుమానంతో వేధిస్తున్నాడని ఆమె వాపోయింది.  ఈ సంఘటన కరీంనగర్‌ జిల్లా కోరుట్లలో చోటుచేసుకుంది. సీఐ రాజశేఖర్‌రాజు వివరాల ప్రకారం.. కోరుట్లకు టి.నర్సింహాచలం (48) తన భార్య అనిత ఫోన్‌లో ఓ సీక్రెట్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేశాడు. ఆ యాప్‌తో ఆమె ఫోన్‌ను ట్రేస్‌ చేయడం మొదలుపెట్టాడు. దీంతోపాటు ఆమె ఫోన్‌ను కూడా భర్తే ఆపరేట్‌ చేస్తున్నాడు. వీటితోపాటు ఆమె వాట్సాప్‌ చాటింగ్‌ చూడటం, ఆడియో రికార్డింగ్‌ వినడం వంటివి చేస్తున్నాడు. ఈ తనకు తెలియకుండా ఫోన్‌ను అతడు అనుసంధానం చేసి వాటితో వీడియో షూటింగ్‌ కూడా చేసేవాడు. ఈ విషయం భార్య ఆలస్యంగా గుర్తించి బుధవారం పోలీసులను ఆశ్రయించింది.

కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా భర్త నర్సింహాచలం భార్య ఫోన్‌లో చేసిన నిర్వాకాన్ని అంగీకరించాడు. కొన్నేళ్ల కిందట ఇంట్లో నుంచి పోయిన బంగారం విషయంలో ఆరా తీయడానికి ఈ సీక్రెట్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసినట్లు నిందితుడు చెప్పాడని సీఐ తెలిపారు. ఇదే రీతిలో మరో ఇద్దరు బంధువుల ఫోన్లలోనూ సీక్రెట్‌ యాప్‌ వారికి తెలియకుండా ఇన్‌స్టాల్‌ చేసినట్లు విచారణలో తేలింది. బంధువుల ఫోన్లలో సీక్రెట్‌ యాప్‌ను ఎందుకు ఇన్‌స్టాల్‌ చేశాడన్న విషయంలో పోలీసులు విచారిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నర్సింహాచలంపై 498, 354 (సీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు. (చదవండి: ఇంగ్లండ్‌ టెస్ట్‌ మ్యాచ్‌ వ్యాఖ్యాతగా పాలమూరువాసి)

చదవండి: ‘భీమ్లా నాయక్‌’లో పాడిన ‘కిన్నెర’నాదుడు ఎవరో తెలుసా?

మరిన్ని వార్తలు