సైబర్‌ ల్యాబ్‌ ఎస్‌ఐ ఆత్మహత్య 

8 Dec, 2021 04:34 IST|Sakshi

కోర్టు కేసులతో పదోన్నతి ఆగిపోయింది

నా బ్యాచ్‌ వాళ్లంతా డీఎస్పీ హోదాలో ఉన్నారు.. 

మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నాను.. లేఖలో వెల్లడి 

కర్నూలు: ‘నా చావుకు ఎవరూ కారకులు కాదు.. కోర్టు కేసులతో పదోన్నతి ఆగిపోయి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాను.. నా బ్యాచ్‌ వాళ్లంతా డీఎస్పీ హోదాలో ఉన్నారు.. కుటుంబ సభ్యులంతా దూరంగా ఉండటం వల్ల మనస్తాపానికి గురై చనిపోతున్నా’ అంటూ కర్నూలు సైబర్‌ ల్యాబ్‌ ఎస్‌ఐ డి.రాఘవరెడ్డి పురుగు మందు తాగి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకెళ్తే.. అనంతపురం జిల్లా కదిరి తాలూకా నల్లసింగయ్యగారిపల్లెకు చెందిన రాఘవరెడ్డి 1991లో ఎస్‌ఐగా పోలీసు శాఖలో చేరారు. ప్రస్తుతం సైబర్‌ ల్యాబ్‌ ఎస్‌ఐగా పనిచేస్తున్నారు.

కర్నూలు అశోక్‌నగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. కాగా, 2001లో కర్నూలు రైల్వే ఎస్‌ఐగా పనిచేసేటప్పుడు ఈయనపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై కోర్టులో విచారణ సాగుతుండటంతో పదోన్నతి ఆగిపోయింది. మరోవైపు రాఘవరెడ్డికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు ప్రేమ వివాహం చేసుకుని హైదరాబాద్‌లో ఉంటున్నాడు. అప్పటి నుంచి కుమారులతోపాటు భార్యతో మనస్పర్థలొచ్చాయి. దీంతో వారు రాఘవరెడ్డికి దూరంగా ఉంటున్నారు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన ఆయన పురుగు మందు తాగారు.

ఆ బాధ తట్టుకోలేక ఫ్లాట్‌ నుంచి బయటకు వచ్చి లిఫ్ట్‌లో కిందికి దిగి పక్కనే అపస్మారక స్థితిలో పడిపోయాడు. వాచ్‌మెన్‌ గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. సీఐ పార్థసారథిరెడ్డి, ఏఆర్‌ డీఎస్పీ ఇలియాజ్‌ బాషా తదితరులు రాఘవరెడ్డి ఇంటికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రాఘవరెడ్డి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇంట్లో ఉన్న సూసైడ్‌ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు