పెళ్లిచేసుకుని మోసం చేస్తున్నాడు: లేడీ కానిస్టేబుల్‌ ఫిర్యాదు 

19 May, 2021 06:43 IST|Sakshi

బంజారాహిల్స్‌: గతంలో పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి తనను బెదిరించి పెళ్లి చేసుకుందంటూ అబ్బాయి.. పెళ్లి చేసుకున్న కొన్ని నెలల్లోనే కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదని దూరం పెట్టాడంటూ అమ్మాయి.. పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ పోలీసులకు ఫిర్యాదులు చేశారు. తనకంటే ముందే ముగ్గురిని హనీట్రాప్‌ చేసి  పెళ్లిచేసుకుని మోసం చేసిందంటూ అతడు ఆరోపించగా, తన మొదటి పెళ్లి గురించి తెలిసిన తర్వాతే పెళ్లి చేసుకున్నాడంటూ ఆమె తేల్చిచెప్పింది. జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. 

రహ్మత్‌నగర్‌లో నివాసముంటున్న ఎం.సంధ్యారాణి(28) ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. ఆమెకు గతంలో వివాహం కాగా ఏడేళ్ల కూతురు ఉంది. భర్త ఆత్మహత్య చేసుకోవడంతో కూతురితో కలిసి ఉంటోంది. కరీంనగర్‌ జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన పూసల చరణ్‌తేజ (24) రహ్మత్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. అతడితో రెండేళ్ల క్రితం సంధ్యారాణికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వారిద్దరూ గతేడాది నవంబర్‌ 7న కూకట్‌పల్లిలోని ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. తనకు ఏడేళ్ల కూతురు ఉందని, భర్త ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలిసిన తర్వాతే పెళ్లి చేసుకుంటున్నానంటూ చరణ్‌తేజ్‌ వద్ద నుంచి బాండ్‌ పేపర్‌ రాయించుకుంది.  

భర్త వదిలిపెట్టి వెళ్లిపోయాడంటూ.. పెళ్లయిన కొన్నిరోజుల తర్వాత నుంచే వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. దాంతో నాలుగు రోజుల క్రితం ఇంట్లో చెప్పకుండా చరణ్‌తేజ వెళ్లిపోయాడు. ఫోన్లు చేసినా స్పందించకపోవడంతో తన భర్త వదిలిపెట్టి వెళ్లిపోయాడంటూ సంధ్యారాణి ఆదివారం జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న చరణ్‌తేజ పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు. తనను వదిలి వెళ్లవద్దంటూ భార్య సంధ్యారాణి కోరగా తనకు కాపురం ఇష్టం లేదంటూ చెప్పాడు. 

శంషాబాద్‌ డీసీపీకి ఈమెయిల్‌ ద్వారా ఫిర్యాదు 
శంషాబాద్‌: మోసం చేసి పెళ్లి చేసుకున్న తన భార్య హింసిస్తోందని చరణ్‌తేజ శంషాబాద్‌ డీసీపీకి సోమవారం ఈ–మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశాడు. ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సంధ్యారాణి గతంలో రెండు వివాహాలు చేసుకున్న విషయాన్ని దాచిపెట్టి తనను వలలో వేసుకొని ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకుందని తెలిపాడు. అప్పటి నుంచి తనను వివిధ రకాలుగా వేధిస్తున్నట్లు చెప్పాడు. తనను తీవ్రంగా కొట్టడంతో పాటు తల్లిదండ్రులు, స్నేహితులను కలవనీయకుండా చేస్తోందన్నారు. సంధ్యారాణి కుటుంబం నుంచి తనకు, తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు.   

విచారణ చేస్తున్నాం.. 
మహిళా కానిస్టేబుల్‌ సంధ్యారాణి ఫిర్యాదు మేరకు చరణ్‌తేజను పిలిపించి విచారణ చేస్తున్నాం. అన్నీ తెలిసే చరణ్‌తేజ తనను పెళ్లి చేసుకున్నాడని, అతడితోనే జీవిస్తానంటూ సంధ్యారాణి చెబుతోంది. వీరిద్దరికి కౌన్సిలింగ్‌ చేసిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటాం. 
– రాజశేఖర్‌రెడ్డి, జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌  
చదవండి: 
తెలంగాణలో సెంచరీ కొట్టిన ప్రీమియం పెట్రోల్‌ ధర

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు