వీళ్లు మామూలు లేడీలు కాదు.. పెద్ద కేడీలు

19 Apr, 2021 09:15 IST|Sakshi

జగిత్యాల: సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో కొందరు మహిళలు ప్రముఖులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నారు. ఫొన్‌లలో పరిచయం పెంచుకొని వారితో సన్నిహితంగా మెదులుతూ ఫొటోలు తీసుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారు. మాయలేడీ ముఠాల బ్లాక్‌మెయిల్స్‌కు బెదిరిన పలువురు ప్రముఖులు, డబ్బున్న యువకులు పెద్ద మొత్తంలో సమర్పించుకుంటున్నారు. ఇలాంటి ముఠాల బాగోతం జిల్లాలో ఇటీవల వరుసగా వెలుగుచూస్తున్నాయి.

 వరుసగా ఇదే తరహా ఘటనలు 
►  జిల్లాలోని ధర్మపురికి చెందిన జమున అనే మహిళ వ్యవహారం గత డిసెంబర్‌లో వెలుగుచూసింది. జిల్లాలో పలు ప్రాంతాలకు చెందిన పరిచయం ఉన్న వ్యక్తులతో సన్నిహితంగా మెదులుతూ వారిని రహస్య ప్రాంతాలకు రప్పించేది. అక్కడికొచ్చాక ఆ ముఠాలోని మరో ముగ్గురు వ్యక్తులతో బెదిరించి వారి వద్ద గల డబ్బు, బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్‌లు దోచుకున్నారు. 

►  జగిత్యాల హనుమాన్‌వాడకు చెందిన కూకట్‌ రాజ్‌కుమార్, జగిత్యాల అర్బన్‌ మండలం తిప్పన్నపేటకు చెందిన నలువాల తిలక్, సారంగాపూర్‌ మండలం పెంబట్లకు చెందిన కోలపాక దినేశ్, ధర్మపురి పట్టణం మామిడివాడకు చెందిన మామిడి జమునతోపాటు రాయికల్‌ మండలం అల్లీపూర్‌కు చెందిన 20 ఏళ్ల యువతితో కలిసి గత అక్టోబర్‌ నుంచి జిల్లాలో పరిచయం ఉన్న వారితో పాటు డబ్బు ఉన్న వ్యక్తులను పరిచయం చేసుకుని రహస్య ప్రాంతాలకు తీసుకెళ్లి మహిళతో సన్నిహితంగా ఉంటున్న సమయంలో సదరు ముగ్గురు వీడియోలు చిత్రీకరించే వారు. వీటిని సోషల్‌మీడియా, వాట్సాప్‌లలో పోస్ట్‌ చేస్తామని భయభ్రాంతులకు గురిచేస్తూ వారి వద్దనున్న బంగారు ఆభరణాలు, నగదు, సెల్‌ఫోన్లు దోపిడీకి పాల్పడ్డారు. 

►  డిసెంబర్‌ 22న జగిత్యాల విద్యానగర్‌కు చెందిన ఒకరిని ఓ మహిళ మేడిపల్లి మండలం వల్లంపల్లికి పిలిపించి బెదిరింపులకు పాల్పడింది. నాలుగు తులాల బంగారం, సెల్‌ఫోన్‌ ఎత్తుకెళ్లింది. బాధితుడు ఫిర్యాదుతో వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. 

►  సారంగాపూర్‌ మండలం రేచపల్లికి చెందిన ఓ మహిళ ముఠాగా ఏర్పడి జగిత్యాల అర్బన్‌ మండలం మోతె గ్రామానికి చెందిన ఒకరిని నాలుగు నెలల క్రితం పరిచయం చేసుకున్నారు. తన వద్ద పలువురు యువతులున్నారని, సన్నిహితంగా ఉంచేందుకు వారిని ఒప్పిస్తానని నమ్మబలికి అతని నుంచి దశలవారీగా రూ.26 లక్షలు తమ ఖాతాల్లోకి మళ్లించింది. ఈ డబ్బులను సుమారు రూ.18 లక్షలు బుగ్గారం మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఖాతాలోకి వెళ్లాయి. సదరు వ్యక్తి డబ్బుల కోసం మహిళను నిలదీయడంతో తనను, తన కూతురును వాడుకుని చంపుతానని బెదిరిస్తున్నాడని జగిత్యాల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో అసలు నిజయం తెలియడంతో వారే అవాక్కయ్యారు. 
 
►  ఇదే మహిళ మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు చెందిన ఒకరిని, కోరుట్లకు చెందిన వ్యక్తిని, జగిత్యాల రూరల్‌ మండలం అనంతారం గ్రామానికి చెందిన వ్యక్తిని మోసం చేసింది. సదరు మహిళపై బాధితుని ఫిర్యాదుతో కేసు నమోదు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా అప్పటి జగిత్యాల ఇన్‌చార్జి ఎస్పీ కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డిపై బుగ్గారం మండలానికి చెందిన రాజకీయ నాయకుడు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాడు.  
 
►   నాలుగు రోజుల క్రితం వేములవాడలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన మహిళ కుంట సుమిత అలియాస్‌ నందు అక్కడి పోలీసులు ఓ కేసులో అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సదరు మహిళ సైతం పలువురు యువతులు తన వద్ద ఉన్నారని, సెల్‌ఫోన్‌లో మాట్లాడిస్తూ వారితో సన్నిహిత్యం ఏర్పాటు చేసుకుని ఒకరి నుంచే రూ.15 లక్షలు నరెండ్ల గంగారెడ్డి అనే వ్యక్తి ఖాతాలో వేయించి మోసానికి పాల్పడింది. 

వెలుగుచూడని నిజాలెన్నో..
జిల్లాలో ప్రముఖులు, డబ్బున్న వారిని ఈ కిలేడీ ముఠాలు పరిచయాలు పెంచుకుని సన్నిహితంగా ఉంటూ అందినంత డబ్బు వసూలు చేస్తున్నాయి. వీరి బారిన పడిన వారు జిల్లాలో చాలా మంది ఉన్నప్పటికీ పరువు పోతుందని పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. మరికొంత మంది మాత్రం డబ్బులు తీసుకుని పలువురు యువతులను వారి వద్దకు పంపి వారితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను తెప్పించుకుని వారిని బ్లాక్‌మెయిల్‌ చేస్తూ అందినంత దోచుకుంటున్నారు. పరువు పోతుందనే బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకురావడం లేదు. 

( చదవండి: ఆరోగ్యం బాగు చేస్తామని క్షుద్ర పూజలు, ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్‌ ) 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు