‘టప్పర్‌వేర్‌’తో  రూ.4కోట్ల మోసం

20 Sep, 2020 12:07 IST|Sakshi

కమీషన్‌ పేరిట కుచ్చుటోపీ 

పోలీసుల అదుపులో కి‘లేడీ’

ఆమె ఓ కి‘లేడీ’.. విలాసాలకు అలవాటు పడి కమీషన్ల పేరిట మహిళలను లక్ష్యంగా చేసుకుంది. వ్యాపారంలో రూ.లక్ష పెట్టుబడి పెడితే నెలకు రూ.30 వేల కమీషన్‌ వస్తుందని నమ్మబలికింది. ఇలా మహిళలు ఒకరిద్వారా మరొకరు మొత్తం 15 మంది ఆమెకు సుమారు రూ.4 కోట్లు ముట్టజెప్పారు. రెండు నెలలు వారికి కమీషన్‌ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత ముఖం చాటేసింది. పెట్టుబడి పెట్టిన వారంతా డబ్బులు అడగడంతో లేవంటూ ఎదురుతిరిగింది. దీంతో బాధితులు లబోదిబో మంటున్నారు. ఈ విషయంపై ఎస్పీకి ఫిర్యాదు అందడంతో సదరు మహిళను అదుపులోకి తీసుకుని.. అన్ని కోణాల్లో దర్యాప్తునకు ఆదేశించారు.

నల్లగొండ క్రైం : టప్పర్‌వేర్‌ (ప్లాస్టిక్‌ తరహా డబ్బాలు) వ్యాపారం పేరిట 15 మందికి రూ.4కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన కిలేడీని నల్లగొండ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ కిలేడీ చేతిలో మోసపోయిన వారు స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డికి మొరపెట్టుకోగా ఆయన ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ కేసు లోతైన విచారణ నిమిత్తం టాస్క్‌ఫోర్స్‌కు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ పట్టణంలోని శివాజీనగర్‌ చెందిన ఆకుల స్వాతి టప్పర్‌ వేర్‌ వ్యాపారం పేరిట దుకాణం తెరిచింది. ఈ వ్యాపారంలో రూ.లక్ష పెట్టుబడి పెడితే నెలకు రూ.30వేల కమీషన్‌ వస్తుందని పలువురు మహిళలకు మాయమాటలు చెప్పింది. పట్టణంలోని యాటకన్నారెడ్డి కాలనీకి చెందిన మానస రూ.కోటి 30 లక్షలు స్వాతికి ఇచ్చింది. అదే కాలనీకి చెందిన యాట భారతమ్మ రూ.19 లక్షలు పెట్టుబడిగా ఇచ్చింది.

ఇలా 15మంది మహిళలనుంచి రూ.4 కోట్లకుపైగానే వసూలు చేసింది. వరుసగా రెండు నెలలపాటు కమీషన్‌ డబ్బులు ఇచ్చింది. ఆ తర్వాత కమీషన్‌ ఇవ్వడం మానేసింది. పెట్టుబడులు పెట్టిన వారంతా డబ్బులు అడగడం మొదలు పెట్టడంతో ‘మీరు ఇచ్చేటప్పుడు ఏమైనా కాగితం రాసుకున్నామా..‘ అంటూ ఎదురుతిరిగింది. డబ్బులు లేవంటూ బెదిరించసాగింది. దీంతో బాధితులంతా శనివారం ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డికి మొరపెట్టుకున్నారు. వెంటనే ఆయన స్పందించి బాధితులతో కలిసి వచ్చి ఎస్పీకి రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. వాస్తవాలను విచారించి బాధితులకు న్యాయం చేయాలిన ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. దీంతో వెంటనే స్వాతిని అదుపులోకి తీసుకున్నారు. కేసును సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు అప్పగించారు.

ప్రజల డబ్బుతో విలాస జీవితం
కమీషన్ల పేరిట మహిళలను లక్ష్యంగా చేసుకున్న ఆకుల స్వాతి దందాకు తెరలేపినట్లు పోలీసులు గుర్తించారు. బాధితులనుంచి వివరాలు సేకరిస్తున్నారు. ప్రాథమికంగా రూ.4కోట్ల వరకు కుచ్చుటోపీ పెట్టినట్లు ప్రత్యేక పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఇంటి దగ్గరే ఉండి రూ.లక్ష పెట్టుబడి పెడితే నెలకు రూ.30వేల కమీషన్‌ వస్తుందని చెప్పడంతో ఒకరి ద్వారా ఒకరు చైన్‌ లింక్‌ తరహాలో పరిచయం ఏర్పడి రూ.లక్షల్లో పెట్టిన పెట్టుబడి కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. ప్రజలను మోసగించి తీసుకున్న డబ్బుతో కారు, ఇతర చోట్ల ఇంటి స్థలాలు కొనుగోలు, విలాసవంతమైన వస్తువులు కొన్నట్లు సమాచారం. బాధితులు ఎంతమంది ? వసూలు చేసిన డబ్బు ఎంతా? తీసుకున్న డబ్బుతో ఏం చేసింది ? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు