కోట్లు కొల్లగొడుతున్న ‘లగాన్‌ గ్యాంగ్‌’.. కుదిరితే మామూళ్లు, లేదంటే కత్తి

8 Sep, 2021 08:04 IST|Sakshi

ముందు ఒక కారు...ఆ వెనుక నాలుగు బైక్‌లు.. అందరూ బలిష్టంగా ఉంటారు. చూడగానే రౌడీల్లా కనిపిస్తారు. ‘లగాన్‌ గ్యాంగ్‌’గా పేరుపొందిన వీరు అక్రమ రవాణాను అన్నీ తామై నడిపిస్తారు. ఎలాంటి బిల్లులు లేకుండా గ్రానైట్‌ తరలించే లారీలకు ముందు వెళ్తుంటారు. దారిలో ఎవరైనా లారీలను ఆపితే మామూళ్లతో మచ్చిక చేసుకోవాలనుకుంటారు...కుదరకపోతే మెడపై కత్తి పెట్టి బెదిరిస్తారు. అదీ కాకపోతే దాడులకు సైతం    దిగుతారు. అంతిమంగా అక్రమ    రవాణాకు అండదండలు అందిస్తుంటారు. ఇందుకోసం ఒక్కో లోడుకు రూ.20 వేల నుంచి రూ.30 వేల దాకా వసూలు చేస్తారు. రాయల్టీ రూపంలో సర్కారు ఖాజానాకు చేరాల్సిన రూ.కోట్ల సొమ్మును కొట్టేస్తున్నారు.

సాక్షి,తాడిపత్రి : తాడిపత్రి....గ్రానైట్‌ పరిశ్రమకు పేరుగాంచింది. కానీ చుట్టుపక్కల ఎక్కడా క్వారీలు లేవు. గ్రానైట్‌ బండలన్నీ చిత్తూరు, ఒంగోలు, పొదిలి, కనిగిరి,     కృష్ణగిరి నుంచి ఇక్కడికి తీసుకొస్తారు. ఒక లోడు గ్రానైట్‌ బండలు క్వారీ నుంచి తాడిపత్రికి చేరాలంటే రూ.45 వేల నుంచి రూ.50 వేల వరకు రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. అయితే ‘లగాన్‌ గ్యాంగ్‌’ రాయల్టీ లేకుండానే రవాణా చేస్తామని క్వారీ, పాలిష్‌ మిషన్‌ యూనిట్ల వ్యాపారులతో ఒప్పందం చేసుకుంటోంది.

గ్రానైట్‌ బండల లారీ బయలుదేరగానే పైలెట్‌గా ముందు వెళ్తారు. చెక్‌ పోస్టులు, అధికారుల తనిఖీని సైతం వారే మేనేజ్‌ చేస్తారు. ఇందుకు ఒక్కో లారీ లోడ్‌కు రూ.20 వేల నుంచి రూ.30 వేలు తీసుకుంటారు. తక్కువ మొత్తంతోనే పని జరుగుతుండటంతో వ్యాపారులు కూడా ‘జీరో’ దందాకే మొగ్గు చూపుతున్నారు. అందువల్లే ఇతర ప్రాంతాల్లోని క్వారీల నుంచి గ్రానైట్‌ బండలు తాడిపత్రికి రావాలన్నా...తాడిపత్రిలో పాలిష్‌ అయిన బండలు జిల్లా దాటాలన్నా ‘లగాన్‌ గ్యాంగ్‌’ కీలకంగా మారింది.  

విజిలెన్స్‌ కళ్లుగప్పి అక్రమ రవాణా 
విజిలెన్స్‌ అధికారులు దాడులకు దిగితే..ఆ విషయం ముందుగానే లగాన్‌ గ్యాంగుకు తెలిసిపోతుంది. దీంతో దారి తప్పించే చర్యలకు ‘పైలెట్లు’ ఉపక్రమిస్తారు. ఒక వేళ మరీ తప్పదనుకుంటే లారీలోని గ్రానైట్‌ పరిమాణాన్ని బిల్లులో తక్కువ చూపించి రవాణా చేస్తారు. ఒకే బిల్లుతో 5 నుంచి 6 లోడ్లు తరలిస్తారు. ఈ మొత్తం తతంగంలో అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి బాగోగులు చూసుకుంటారు.  

రెండేళ్లుగా బ్రేక్‌...మళ్లీ ప్రారంభం 
2015 ఆగస్టులో భూగర్భ గనుల శాఖ విజిలెన్స్‌ ఏడీగా ప్రతాప్‌రెడ్డి ఉండేవారు. తాడిపత్రిలో కొనసాగుతున్న అక్రమాలను చూసి ఆయన నివ్వెరపోయారు. బిల్లులు సక్రమంగా లేని లారీలకు భారీగా జరిమానాలు విధించారు. దీంతో అప్పట్లో జేసీ సోదరుల ప్రధాన అనుచరుడు పొట్టి రవి ఆయన్ను బెదిరించారు. అయినప్పటికీ విజిలెన్స్‌ ఏడీ భయపడకుండా దాడులు మరింత ముమ్మరం చేశారు. ఇలా రెండేళ్లలో గ్రానైట్‌ అక్రమ దందాపై ఉక్కుపాదం మోపారు.

2015కు ముందు జరిమానా రూపంలో ఏటా రూ. కోటి వసూలయ్యేది. ప్రతాప్‌రెడ్డి వచ్చాక 2015–16లో రూ.5.40 కోట్లు, 2016–17లో రూ.5.55 కోట్లు రాబట్టారు. దీంతో లగాన్‌ గ్యాంగ్‌ ప్రతాప్‌రెడ్డిని దారికి తెచ్చుకోవాలని  చూసింది... ఆ తర్వాత బెదిరించింది. భౌతిక దాడులకు యతి్నంచింది. అయినా ఫలితం లేకపోకపోవడంతో తమ ‘పచ్చ’ నేతలకు చెప్పి అవినీతి మరక అంటించేందుకు ప్రతాప్‌రెడ్డిపై డైరెక్టర్‌కు ఫిర్యాదు చేయించింది. అయితే ఉన్నతాధికారులు ఏడీ ప్రతాప్‌రెడ్డికి క్లీన్‌చిట్‌ ఇచ్చారు.  

లగాన్‌ గ్యాంగ్‌కు ‘పచ్చ’నేత అండదండలు 
తాడిపత్రిలోని శ్రీనివాసపురానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు ఈ లగాన్‌ గ్యాంగ్‌కు బాస్‌గా వ్యవహరిస్తున్నాడు. జేసీ సోదరుల అండతో గతంలోనూ ‘లగాన్‌ గ్యాంగ్‌’ను నడిపించేవాడు. టీడీపీ హయాంలో మైనింగ్‌ ఏడీ ప్రతాప్‌రెడ్డిని బెదిరించిన కేసులోనూ అతను నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం అతనే మళ్లీ జీరో దందాను ప్రోత్సహిస్తున్నాడు. కర్నూలు జిల్లాలోని ఆదోని సమీపంలోని క్వారీల నుంచి తాడిపత్రి గ్రానైట్‌ పరిశ్రమలకు ముడి సరుకును యథేచ్ఛగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నాడు.  

తెలిసినా...కన్నెత్తి చూడని అధికారులు 
తాడిపత్రిలో గ్రానైట్‌ మాఫియా సాగిస్తోన్న అక్రమ దందా భూగర్భ గనుల శాఖ అధికారులకు తెలిసినా ‘లగాన్‌ గ్యాంగ్‌’తో వారికున్న సత్సంబంధాలతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అప్పట్లో ఏడీ ప్రతాప్‌రెడ్డి జీరో దందాకు అడ్డుగా నిలవగా, గనులశాఖ ఉన్నతాధికారులు మాత్రం మామూళ్లు తీసుకుని ‘మాఫియా’కే మద్దతిచ్చారు. అందువల్లే ఏ ఒక్క అధికారి కూడా తాడిపత్రి వైపు కన్నెత్తి చూడలేదని గనులశాఖ సిబ్బందే చెబుతున్నారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు