ప్రమాదం కాదు.. పథకం ప్రకారమే చంపేశారు!

14 Dec, 2021 18:20 IST|Sakshi

లఖింపూర్ ఖేరీ ఘటనపై సిట్‌ అధికారులు

నిందితులపై హత్యానేరం మోపాలి

కోర్టుకు లేఖ రాసిన సిట్‌ అధికారులు

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో చోటుచేసుకున్న ఘటన పథకం ప్రకారం జరిగిందని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) స్పష్టం చేసింది. ఆందోళన చేస్తున్న రైతులను చంపాలన్న ఉద్దేశంతోనే ఈ మారణ హోమానికి పాల్పడ్డారని వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాతో సహా నిందితులపై మోపిన అభియోగాలను సవరించాలని సిట్‌ అధికారులు న్యాయమూర్తికి లేఖ రాశారు. నిందితులపై పెట్టిన ర్యాష్ డ్రైవింగ్ ఆరోపణలను సవరించి... హత్యానేరం మోపాలని కోరారు. 

లఖింపూర్ ఖేరీ ఘటన ప్రమాదవశాత్తు జరలేదని, పథకం ప్రకారం జరిగిందని విచారణాధికారి విద్యారామ్ దివాకర్ కోర్టులో దాఖలు చేసిన దరఖాస్తులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన లఖింపూర్ జిల్లా కోర్టు నిందితులందరినీ మంగళవారం న్యాయస్థానానికి పిలిపించింది. కాగా, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా ఈరోజు జైలులో తన కుమారుడు ఆశిష్ మిశ్రాను కలిశారు. (చదవండి: మాకు న్యాయం కావాలి.. పరిహారం కాదు!)


అక్టోబర్‌ 3న లఖింపూర్ ఖేరీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపైకి తన కారుతో ఆశిష్ మిశ్రా దూసుకురావడంతో నలుగురు అన్నదాతలు, జర్నలిస్ట్‌  చనిపోయారు. తర్వాత ఆందోళన కారులు జరిపిన దాడిలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, కారు డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ఆశిష్ మిశ్రాతోపాటు ఇతర నిందితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. (చదవండి: సోనియా గాంధీ తీవ్ర అభ్యంతరం.. ఆ ప్రశ్న క్షణాల్లో తొలగింపు!)

మరిన్ని వార్తలు