యాప్స్‌తోనే లక్ష్మీపతి నెట్‌వర్క్‌

8 Apr, 2022 09:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోలీసు పుత్రుడై ఉండి.. గంజాయి, హష్‌ ఆయిల్‌ దందాతో ‘హష్‌ నగేశ్‌’ నెట్‌వర్క్‌లో కీలకంగా మారిన వీరవల్లి లక్ష్మీపతి దందా గుట్టును పోలీసులు రట్టుచేశారు. 2020లో మల్కాజ్‌గిరి స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్వోటీ) పోలీసులకు చిక్కిన లక్ష్మీపతి.. తర్వాత ‘వర్కింగ్‌ స్టైల్‌’ పూర్తిగా మార్చేశాడని.. పకడ్బందీగా హష్‌ ఆయిల్‌ దందా నడిపాడని ‘హెచ్‌–న్యూ’ అధికారులు చెప్తున్నారు. 

పేరు కూడా తెలియకుండా..: లక్ష్మీపతి మొదట్లో వాట్సాప్‌ ద్వారా ఆర్డర్లు తీసుకుని గంజాయి సరఫరా చేసేవాడు. మల్కాజ్‌గిరి పోలీసులకు ఇతడి అనుచరులు చిక్కినప్పుడు వారి వాట్సాప్‌ డేటా ఆధారంగానే లక్ష్మీపతిని అరెస్టు చేశారు. దాంతో లక్ష్మీపతి తన పంథా మార్చేశాడు.

మకాంను కూడా మణికొండ నుంచి హఫీజ్‌ పేటకు షిఫ్ట్‌ చేశాడు. ఈసారి ఫేస్‌బుక్‌ మెసెంజర్‌తోపాటు స్నాప్‌ చాట్, టెలిగ్రాం యాప్స్‌ వాడటం మొదలెట్టాడు. వాటిలోనూ వివరాలన్నీ హైడ్‌ చేసి.. కేవలం ‘ఎల్‌పీ’ అనే పేరు మాత్రమే కనిపించేలా చేసేవాడు. ఎక్కడా ఫొటోలేవీ బయటపడనీయలేదు.

కస్టమర్లతోనే బుక్‌ చేయించి...
హైదరాబాద్‌లో అనేక యాప్స్‌ వివిధ వస్తువుల పికప్‌–డెలివరీ సేవలు అందిస్తుండటంతో.. లక్ష్మీపతి వాటిని తన దందా కోసం వాడుకున్నాడు. సోషల్‌ మీడి యా ద్వారా కస్టమర్ల నుంచి ఆర్డర్‌ తీసుకుని, డబ్బును ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్‌ చేయించుకునేవాడు.

‘సరుకు’ తీసుకునే వారితోనే పికప్‌–డెలివరీ సర్వీసు బుక్‌ చేయించేవాడు. హఫీజ్‌పేటలోని ఓ ల్యాండ్‌మార్క్‌ను పికప్‌గా.. వారుండే లొకేషన్‌ను డెలివరీ ప్రాంతంగా బుక్‌ చేయించి.. సరుకును పంపిస్తాడు. ఇంత జా గ్రత్తగా ఉండటంతో అతడిని గుర్తించి, పట్టుకోవడానికి హెచ్‌–న్యూ అధికారులు శ్రమించాల్సి వచ్చింది.

(చదవండి: లగేజ్‌ బ్యాగేజ్‌లలో గంజాయి ప్యాకెట్లు..నలుగురు అరెస్టు)

మరిన్ని వార్తలు