దాణా కేసులో లాలూకు బెయిల్‌

18 Apr, 2021 02:50 IST|Sakshi

మంజూరు చేసిన జార్ఖండ్‌ హైకోర్టు

జైలు నుంచి రేపు లాలూ విడుదలయ్యే అవకాశం

రాంచీ:  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దాణా కుంభకోణంలో రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు(73) జార్ఖండ్‌ హైకోర్టు శనివారం బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో ఆయన ఇప్పటికే సగం జైలు శిక్షను పూర్తి చేసుకోవడంతో న్యాయమూర్తి జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ బెయిల్‌ మంజూరు చేశారు. పాస్‌పోర్టును ప్రభుత్వానికి సమర్పించాలని, అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లరాదని లాలూను ఆదేశించారు. బెయిల్‌పై బయట ఉన్నంత కాలం చిరునామా, ఫోన్‌ నంబర్‌ మార్చొద్దని స్పష్టం చేశారు.

ఐపీసీ సెక్షన్ల కింద నమోదైన ఒక కేసుల్లో, అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన మరో కేసులో రూ.5 లక్షల చొప్పున జరిమానాలను డిపాజిట్‌ చేయాలని, రూ.లక్ష చొప్పున విలువైన రెండు పూచీకత్తులు సమర్పించాలని పేర్కొన్నారు. తనకు బెయిల్‌ ఇవ్వాలంటూ లాలూ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరిపారు. లాలూ తరపున సీనియర్‌ లాయర్‌ కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. సగం శిక్షా కాలం పూర్తిచేసుకోవడంతో బెయిల్‌కు అర్హుడేనని పేర్కొన్నారు. లాలూకు బెయిల్‌ ఇవ్వాలన్న వాదనను సీబీఐ తరపు న్యాయవాది రాజీవ్‌ సిన్హా వ్యతిరేకించారు.

అయినప్పటికీ బెయిల్‌ ఇవ్వడానికే న్యాయస్థానం మొగ్గుచూపింది. న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేయడంతో లాలూ విడుదలకు రంగం సిద్ధమయ్యింది. లాంఛనాలన్నీ పూర్తయ్యాక సోమవారం విడుదలయ్యే అవకాశాలున్నాయని లాలూ తరఫు న్యాయవాది దేవర్షి మండల్‌ చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్‌లో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అధికారికంగా ఢిల్లీలోని తిహార్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పటిదాకా 39 నెలల 25 రోజులపాటు జైలు శిక్ష అనుభవించారు.

మరో మూడు కేసుల్లో గతంలోనే బెయిల్‌
దాణా కుంభకోణంలో(దుమ్కా ట్రెజరీ కేసు) లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు 2018 మార్చి 24న రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు 14 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. ఒక కేసులో రూ.60 లక్షలు, మరో కేసులో రూ.30 లక్షల జరిమానా విధించింది. 1990వ దశకంలో దాణా కొనుగోలు, పంపిణీకి సంబంధించి దుమ్కా ట్రెజరీ నుంచి రూ.3.13 కోట్లు అక్రమంగా విత్‌డ్రా చేశారంటూ లాలూతోపాటు ఇతరులపై కేసు నమోదయ్యింది. ఇదే దాణా కుంభకోణానికి సంబంధించిన దేవ్‌గఢ్, చైబాసా, డోరందా ట్రెజరీ కేసుల్లో ఆయనకు గతంలోనే బెయిల్‌ లభించింది. దుమ్కా ట్రెజరీ కేసులో కోర్టు తీర్పు వెలువడాల్సి ఉంది. తమ పార్టీ అధినేత జైలు నుంచి విడుదల కానుండడంతో ఆర్జేడీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.  

మరిన్ని వార్తలు