భూ వివాదం: ఎస్‌ఐపై జెడ్పీటీసీ ఫిర్యాదు

30 Sep, 2020 10:12 IST|Sakshi

సాక్షి, మునుగోడు/రామగిరి(నల్లగొండ): మునుగోడు ఎస్‌ఐ మండలంలోని భూ వివాదాలతో పాటు ఇసుక అక్రమ రవాణాదారులకు అండగా నిలుస్తున్నాడని ఆరోపిస్తూ స్థానిక జెడ్పీటీసీ నారబోయిన స్వరూపరాణిరవి ఆదివారం ట్విట్టర్‌లో డీజీపీతో పాటు మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, నల్లగొండ ఎస్పీ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. భూవివాదాల్లో అనేక మందిని ఇబ్బందులకు గురిచేయడంతో పాటు ఒకే వర్గం వ్యక్తులకు పూ ర్తి మద్దతు పలుకుతూ బాధితులను రోజుల తరబడి స్టేషన్‌ చుట్టూ తిప్పుకుంటున్నాడని ఆరో పించారు. ఎస్‌ఐ చేస్తున్న అక్రమాలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద  ఉన్నాయని, అధి కారులు తగిన విచారణ జరిపి చర్యలు తీసుకో వాలని కోరారు. స్పందించిన జిల్లా ఎస్పీ రంగనాథ్‌ త్వరలో విచారణ జరిపిస్తానని మెసేజ్‌ ద్వారా హామీ ఇచ్చినట్లు జెడ్పీటీసీ తెలిపారు.   

అదృశ్యమైన మహిళ మృతి
మిర్యాలగూడ‌: రెండు రోజుల క్రితం అదృశ్యమైన మహిళ మృతిచెందింది. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది.  టూ టౌన్‌ సీఐ దొంతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని వాసవీనగర్‌కు చెందిన కామెల్లి సుధీర్‌కుమార్‌కు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఒంగోలు పట్టణానికి చెందిన అనూష(26)తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు రెండేళ్ల కూతురు ఉంది. కొంత కాలంగా కుటుంబంలో కలహాలు చోటు చేసుకోవడంతో రెండు రోజుల క్రితం అనూష ఇంటినుంచి వెళ్లిపోయింది. దీంతో భర్త సుధీర్‌కుమార్‌ టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ క్రమంలో మంగళవారం బోటిక్‌పార్క్‌ పెద్ద చెరువు వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహం అనూషదిగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించి అనూష తల్లికి సమచారం అందించారు. మధ్యాహ్నం మిర్యాలగూడకు చేరుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కాగా, క్షణికావేశంలో కుటుంబ కలహాలతోనే అనూష ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.     

మరిన్ని వార్తలు