గల్లా కుటుంబ సభ్యులపై భూ ఆక్రమణ కేసు

30 Sep, 2021 03:34 IST|Sakshi
గల్లా జయదేవ్‌

తన పొలం ఆక్రమించారని న్యాయస్థానాన్ని ఆశ్రయించిన రైతు 

కోర్టు ఆదేశాలతో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి సహా 12 మందిపై కేసులు నమోదు

సాక్షి ప్రతినిధి,తిరుపతి: ‘అమరరాజా’ సంస్థల భూ ఆక్రమణలపై కోర్టు ఆదేశాల మేరకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌తోపాటు మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, గల్లా రామచంద్రనాయుడు సహా 12 మందిపై కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లా తవణంపల్లె పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. గల్లా అరుణకుమారి తండ్రి దివంగత రాజగోపాల్‌నాయుడు పేరిట ఏర్పాటు చేసిన రాజన్న ట్రస్ట్, ఎడ్యుకేషన్‌ సొసైటీల కోసం దిగువమాఘం గ్రామంలో భవనాలు నిర్మించారు. ఆ భవనాల సమీపంలో ఉన్న తన పొలాన్ని ఆక్రమించి భారీ ఎత్తున ప్రహరీ నిర్మించారని అదే గ్రామానికి చెందిన రైతు గోపీకృష్ణ తెలిపారు. తన భూమికోసం ఆయన 2015 నుంచి వివిధ రూపాల్లో ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోవడంతో 2నెలల కిందట కోర్టును ఆశ్రయించారు.

విచారణ చేపట్టిన చిత్తూరు నాలుగో అదనపు జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు సదరు ట్రస్ట్‌ సంబంధీకులతోసహా ఆ గ్రామ బాధ్యులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో ఐపీసీ 109, 120బి, 430, 447, 506, ఆర్‌/డబ్ల్యూ149 ఐపీసీ ఆర్‌/డబ్ల్యూ 156(3) సీఆర్‌పీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రాజన్న ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ, చైర్‌పర్సన్‌ గల్లా అరుణకుమారి, సభ్యులు గల్లా రామచంద్రనాయుడు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, గల్లా పద్మావతి, గోగినేని రమాదేవి, కార్యదర్శి సి.రామచంద్రరాజు, ఉద్యోగులు ఎం.పార్థసారథి, భక్తవత్సలనాయుడు, ఎం.మోహన్‌బాబు, న్యాయవాది చంద్రశేఖర్, సర్పంచ్, కార్యదర్శిపై కేసులు నమోదు చేసినట్టు చిత్తూరు డీఎస్పీ సుధాకర్‌ వెల్లడించారు.  

మరిన్ని వార్తలు