Land Grab: టీజీ రౌడీయిజం.. రూ.100 కోట్ల ఆస్తిపై కన్ను

19 Apr, 2022 08:30 IST|Sakshi
టీజీ విశ్వప్రసాద్‌- టీజీ వెంకటేష్‌ -మల్లికార్జున

హైదరాబాద్‌లో రూ.100 కోట్ల ఆస్తిపై టీజీ విశ్వప్రసాద్‌ కన్ను

తప్పుడు రికార్డులతో జెమ్స్‌ అండ్‌ జ్యూవెలరీ పార్క్‌ స్థలం రిజిస్ట్రేషన్‌

60 మందికి పైగా రౌడీలతో స్థలం స్వాధీనం చేసుకునే యత్నం

అందరిపై కేసులు నమోదు చేసిన బంజారాహిల్స్‌ పోలీసులు

ఏ–1గా టీజీ విశ్వప్రసాద్, ఏ–5గా రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌

ఏ–13గా ఆదోని జనసేన ఇన్‌చార్జ్‌ మల్లికార్జున

విచారణలో టీజీ వెంకటేష్‌ మనుషులమని ఒప్పుకున్న రౌడీలు!

సాక్షిప్రతినిధి కర్నూలు: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో రూ. వందకోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేయబోయిన వ్యవహారంలో రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నాయకుడు టీజీ వెంకటేశ్, ఆయన సోదరుడి కుమారుడు టీజీ విశ్వప్రసాద్‌పై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో ఏ–1గా విశ్వప్రసాద్, ఏ–5గా టీజీ వెంకటేష్‌ ఉన్నారు. సినీఫక్కీలో జరిగిన ఈ కబ్జా వ్యవహారం హైదరాబాద్‌లో కలకలం రేపింది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఏపీ జెమ్స్‌ అండ్‌ జ్యూవెలరీ పార్క్‌ నిర్మించేందుకు రెండు ఎకరాల స్థలం కేటాయించారు. ఆ సంస్థ కొంత మేర నిర్మాణాలు చేపట్టి, ఆపై వదిలేసింది. ఇందులో 2,250గజాలు(అరెకరం) స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఈ స్థలంపై వీవీఎస్‌ శర్మ అనే వ్యక్తి కన్నుపడింది. దీన్ని ఎలాగైనా దక్కించుకోవాలని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారు. ఆపై స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు తన బలం సరిపోదని, ఎవరైనా బలమైన వ్యక్తులు అవసరమని వీవీఎస్‌ శర్మ భావించారు. ఈ క్రమంలో స్థలాన్ని తాను కొనుగోలు చేస్తానని, వివాదం తానే సెటిల్‌చేసుకుంటానని టీజీ విశ్వప్రసాద్‌ రంగంలోకి దిగారు. తక్కువ మొత్తానికి స్థలాన్ని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.

రౌడీల సాయంతో స్వాధీనం చేసుకునే యత్నం 
ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో పంచాయితీకి ప్రయతి్నంచారు. అయితే ఒరిజనల్‌ డాక్యుమెంట్లు నిర్మాణ సంస్థకు ఉండటం, వారు పంచాయితీకి ఒప్పుకోకపోవడంతో టీజీ విశ్వప్రసాద్‌ యత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో ఆదోని, మంత్రాలయంతో పాటు హైదరాబాద్‌లోని మరికొంతమంది రౌడీలను తీసుకుని ఆదివారం స్థలం స్వాధీనం చేసుకునేందుకు జేసీబీలతో వెళ్లారు. రెడీమేడ్‌గా ఓ కంటైనర్‌ ఆఫీసును తీసుకుని వెళ్లి అక్కడ ఉంచారు. ఈ వ్యవహారాన్ని అడ్డుకునేందుకు జెమ్స్‌ అండ్‌ జ్యూవెలరీ గార్డు నవీన్‌కుమార్‌ యతి్నస్తే అతనిపై దాడికి దిగారు. దీంతో నవీన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వీరందరిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

అజ్ఞాతంలో టీజీ వెంకటేష్‌   
ఈ కేసులోని వ్యక్తులను అదుపులోకి తీసుకున్న తర్వాత ఏ3, ఏ4గా ఉన్న సుభాశ్‌పోలిశెట్టి, మిథున్‌కుమార్‌లు ఆదివారం రాత్రి పోలీసుస్టేషన్‌ నుంచి తప్పించుకున్నారు. అర్ధరాత్రి మూత్రం వస్తోందని చెప్పి స్టేషన్‌ నుంచి పరారయ్యారు. ఇదిలా ఉండగా రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

ఆదోని, మంత్రాలయానికి చెందిన వారే 50మంది 
ఈ వ్యవహారంలో 63 మందిపై బంజరాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ఏ–1గా టీజీ విశ్వప్రసాద్, ఏ2గా వీవీఎస్‌ శర్మ, ఏ3గా సుభాశ్‌పోలిశెట్టి, ఏ–4గా అల్లు మిథున్‌కుమార్, ఏ–5గా టీజీ వెంకటేశ్, ఏ–13గా మల్లికార్జున అలియాస్‌ మల్లప్ప పేర్లు చేర్చారు. వీరిలో ఏ–1 విశ్వప్రసాద్‌ స్థలాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి, వ్యవహారానికి సూత్రధారి. ఏ–2 వీవీఎస్‌ శర్మ అనే వ్యక్తి తప్పుడు రికార్డులు సృష్టించి, స్థలాన్ని విశ్వప్రసాద్‌కు విక్రయించిన వ్యక్తి. తక్కిన వారంతా విశ్వప్రసాద్‌కు వ్యాపార భాగస్వాములు, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్న వ్యక్తులు.

నవీన్‌ పోలిశెట్టి తూర్పుగోదావరి జనసేన పార్టీ కనీ్వనర్‌. అలాగే మల్లికార్జున అనే వ్యక్తి ఆదోని వాసి. 2019 ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆదోని నుంచి 20 మంది, మంత్రాలయం నుంచి 30 మంది రౌడీలను తీసుకెళ్లింది మల్లికార్జున. ఈ 50 మందిని పోలీసులు విచారిస్తే ఈ విషయం చెప్పారు. దీంతో పాటు తామంతా టీజీ వెంకటేష్‌ మనుషులమని, ఆయన అండతోనే ఇక్కడకు వచ్చినట్లు మల్లికార్జున  చెప్పడంతో కేసులో టీజీ వెంకటేష్‌ పేరును పోలీసులు చేర్చారు.   

మరిన్ని వార్తలు