అశోక్‌రెడ్డి బెట్టింగ్‌ కథ.. అక్షరాలా వందకోట్ల రూపాయలు.. ఐపీఎల్‌–2023 లోనూ

16 Apr, 2023 01:49 IST|Sakshi

పదేళ్లలో బెట్టింగ్‌లో పోగొట్టుకున్న సొమ్ము ఇది..

10–12 ఏళ్లుగా పందేలు నిర్వహిస్తున్న అశోక్‌రెడ్డి 

తాజాగా క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులో అరెస్టు 

పోలీసుల అదుపులో మరో ఇద్దరు, పరారీలో ముగ్గురు ప్రధాన నిందితులు 

రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్‌ వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: పదేళ్ల కిందట బెట్టింగ్‌లోకి అడుగుపెట్టాడు. అడ్డదారిలో డబ్బు సంపాదనపై ఆసక్తి ఉన్నవాళ్లతో కలిసి ముఠాగా ఏర్పడ్డాడు. అది మొదలు క్రమంగా బెట్టింగ్‌కు బానిసై క్రికెట్‌ మొదలు హార్స్‌రైడింగ్‌వరకు అన్ని క్రీడలపై పందేలు నిర్వహించాడు. ఈ క్రమంలో రూ.100 కోట్లు పోగొట్టుకున్నాడు.

ఇటీవల ఐపీఎల్‌–2023లోనూ బెట్టింగ్‌కు పాల్పడి.. నగదు వసూలుకు వెళ్తూ పోలీసులకు దొరికిపోయాడు. ఇది శుక్రవారం రాచకొండ పోలీసులు అరెస్టు చేసిన జక్కిరెడ్డి అశోక్‌రెడ్డి కథ. ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్టు చేసిన పోలీసులు.. మీడియాకు శనివారం వివరాలు వెల్లడించారు. ఎల్బీనగర్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ టీం (ఎస్‌ఓటీ) డీసీపీ మురళీధర్, రాచకొండ సీపీ దేవేంద్రసింగ్‌ చౌహాన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. 

‘నేషనల్‌ ఎక్స్‌ఛేంజ్‌9’ పేరుతో.. 
శ్రీ వెంకటరమణ కాలనీకి చెందిన అశోక్‌ రెడ్డి రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌. ఈజీ మనీకోసం బెట్టింగ్‌లోకి ప్రవేశించాడు. నాగోల్‌లోని బండ్లగూడలో ఉంటున్న మిర్యాలగూడకు చెందిన ఏడుకుళ్ల జగదీష్ తో అతనికి పరిచయం ఏర్పడింది. అశోక్, జగదీష్‌ ఇరువురు కలిసి సులువైన మార్గంలో డబ్బు సంపాదించాలనే అత్యాశతో ఐపీఎల్‌ సీజన్‌లో బెట్టింగ్‌ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో తనకు ముందే పరిచయం ఉన్న, ప్రధాన బుకీలైన ఏపీకి చెందిన పలాస శ్రీనివాసరావు, సురేష్‌ మైలబాతుల అలియాస్‌ శివ, హరియాణకు చెందిన విపుల్‌ మోంగాలను జగదీష్ కు అశోక్‌ రెడ్డి పరిచ యం చేశాడు. కూకట్‌పల్లిలోని భక్తినగర్‌కు చెందిన ఐటీ ఉద్యోగి వొడుపు చరణ్‌ను కలెక్షన్‌ ఏజెంట్‌గా నియమించుకొని ఒక ముఠాగా ఏర్పడ్డారు. ముగ్గురు కలిసి ‘నేషనల్‌ ఎక్స్‌ఛేంజ్‌9’ ద్వారా క్రికెట్‌ బెట్టింగ్‌లను నిర్వహిస్తున్నారు. బెట్టింగ్‌లో పాల్గొనేవారికి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఇస్తారు.

 

నగదు వసూలుకు వెళ్తూ..  
ఇటీవల సన్‌రైజర్స్‌ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌కు ఈ ముఠా నిర్వహించిన బెట్టింగ్‌లో పంటర్ల నుంచి నగదు వసూలు చేసేందుకు వెళ్తున్నట్లు ఎల్బీనగర్‌ ఎస్‌ఓటీ, చైతన్యపురి పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు శుక్రవారం వాసవికాలనీ రోడ్‌నంబర్‌–9లోని బసంతి బొటిక్‌ వద్ద అశోక్, జగదీష్, చరణ్‌లను పట్టుకున్నారు. శ్రీనివాసరావు, సురేష్ , విపుల్‌ మోంగాలు పరారీలో ఉన్నారు. 

ఐపీఎల్‌లో రూ.3 కోట్లు బెట్టింగ్‌.. 
పట్టుబడిన ముగ్గురు నిందితులకు చెందిన ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఎస్‌బీఐ ఖాతాలను పోలీసులు పరిశీలించగా.. ఐపీఎల్‌–2023 సీజన్‌లో ఇప్పటివరకు రూ.3 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. నిందితుల నుంచి రూ.20 లక్షల నగదుతో పాటు బ్యాంకు అకౌంట్లలో ఉన్న రూ. 1.42 కోట్ల నగదును సీజ్‌ చేశారు. ఒక కారు, ఏడు సెల్‌ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు