LB Nagar Varshita Case:ఎల్బీ నగర్‌ ఘటన: చిన్నారి వర్షితది ఆత్మహత్యే

21 Jul, 2022 08:01 IST|Sakshi
ఆటోలో వెళ్తున్న చిన్నారి

నాగోలు: అనేక ప్రశ్నలు.. ఎన్నో అనుమానాల బాలిక వర్షిత మృతి కేసును పోలీసులు ఛేదించారు. మంగళవారం ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆరో తరగతి విద్యార్థిని వర్షిత నాలుగో అంతస్తుపై నుంచి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎల్‌బీనగర్‌ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. బాలిక మృతి పట్ల వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు ఆయన చెప్పారు. బాలికను తీసుకువచ్చిన ఆటో డ్రైవర్‌ దుర్గేష్‌ను విచారించినట్లు ఆయన పేర్కొన్నారు. ఏసీపీ కథనం ప్రకారం వివరాలు.. మన్సురాబాద్‌లోని మధురానగర్‌లో కాలనీ రోడ్డు నంబర్‌– 5లో ఉంటున్న  సత్యనారాణరెడ్డి, ప్రభావతి దంపతుల కూతురు వర్షిత.

మంగళవారం సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన బాలిక చిప్స్‌ కొనుకుంటానంటూ దుకాణానికి వెళ్లింది. మన్సూరాబాద్‌ చౌరస్తాకు వచ్చి ఆటో ఎక్కింది. అక్కడ నుండి ఎల్‌బీనగర్‌ చౌరస్తా మీదగా చంద్రపూరి కాలనీ రోడ్డునెం. 2/బీ కు వెళ్లి ఆటో అతని రూ. 50 ఇచ్చి అక్కడ దిగింది. ఆటోలో వెళ్లే క్రమంలో తన తండ్రికి ఫోన్‌ చేయాలని డ్రైవర్‌కు నంబర్‌ చెప్పింది.  ఫోన్‌ బిజీగా రావడంతో ఆటో డ్రైవర్‌ వర్షితను అపార్ట్‌మెంట్‌ వద్ద  దించేశాడు. అక్కడ ఉన్న వాచ్‌మన్‌ వెంకటమ్మ వర్షిత  బిల్డింగ్‌పైకి వెళ్తుండగా.. ఎవరు కావాలని అడిగింది.  మా నాన్న  కోసం వచ్చానంటూ  చెప్పి బిల్డింగ్‌పైకి వెళ్లింది.

వాచ్‌మన్‌ తన కుమారుడైన రాజున బిల్డిండ్‌పైకి పంపగా ఎవరూ కనిపించలేదు.. ఇంతలోనే వర్షిత నాలుగో అంతస్తుపై నుంచి కిందకు దూకింది. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. చిన్నారి కావాలనే నాలుగో అంతస్తుకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. బాలిక వర్షితపై లైంగిక దాడి జరిగిందా? అనే కోణంలో వైద్య పరీక్షలు చేయగా.. అలాంటిదేమీ లేదని వెల్లడైందన్నారు. చదువులో ముందుండే వర్షిత.. అందరితోనూ కలుపుగోలుగా మసలుకునేదని కాలనీవాసులు కన్నీటిపర్యంతమయ్యారు. కుటుంబంలో నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో సున్నిత మనస్కురాలైన వర్షిత కొంత ప్రభావితమై ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని సమాచారం.    

(చదవండి: మిస్టరీగా చిన్నారి మృతి.. ఆటోడ్రైవర్‌ ఫోన్‌ కాల్‌ కీలకం!)

మరిన్ని వార్తలు