చెల్లిని చంపిన అన్నకు జీవిత ఖైదు

9 Feb, 2021 20:41 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వదినకు ఏడాది జైలు, రూ.1,500 జరిమానా

తీర్పునిచ్చిన జగిత్యాల సెకండ్‌ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ సెషన్‌ జడ్జి సుదర్శన్‌

సాక్షి, జగిత్యాల : చెల్లిని హత్యచేసిన అన్నకు జీవితఖైదు, కేసులో నిందితురాలైన వదినకు ఏడాది జైలు శిక్ష, జరిమానా విధిస్తూ జగిత్యాల సెకండ్‌ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ సెషన్‌ జడ్జి సుదర్శన్‌ సోమవారం తీర్పునిచ్చారు. వివరాలు ఇలా.. రాయికల్‌ మండలం చెర్లకొండాపూర్‌కి చెందిన పల్లికొండ గంగుకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. భర్త చిన్ననర్సయ్య చనిపోయిన అనంతరం ఇద్దరు కూతుళ్లకు, కుమారుడికి పెళ్లి చేసింది. మరో ఇద్దరు కుమార్తెలు పెళ్లికి ఉండటంతో ఆమెకున్న ఐదెకరాల భూమిలో మూడెకరాలు విక్రయించి మూడో కుమార్తె సునీతకు వివాహం చేసింది. అనంతరం చిన్న కుమార్తె రోజా వివాహానికి మిగతా కొంత డబ్బు నిల్వ ఉంచగా కుమారుడు అశోక్‌ ఆస్తుల పంపకం విషయంలో గొడవపడ్డారు.

2015 మే 16న ఉదయం 8.30 గంటలకు రోజా కిరాణం షాపులో ఉండగా అశోక్‌ అక్కడికి వెళ్లి రోకలిబండతో ఆమె తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. కొన ఊపిరితో ఉండగా గంగు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చింది. అయితే అప్పటికే ఆమె మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు రాయికల్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. కేసులో అడిషనల్‌ పీపీ శ్రీవాణి, ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్లుగా సరిలాల్, విజయ్‌రాజ్, సురేందర్, రాజశేఖర్‌రాజు, సీఎంఎస్‌ ఎస్సై రాజునాయక్, కోర్టు కానిస్టేబుల్‌ నవీన్, సీఎంఎస్‌ కానిస్టేబుల్‌ కిరణ్‌ నిందితులకు శిక్ష పడేందుకు కోర్టులో సాక్ష్యులను ప్రవేశపెట్టారు. సోమవారం పల్లికొండ అశోక్‌కు జీవిత ఖైదుతోపాటు రూ.5వేలు జరిమానా, ఆయన భార్య భూలక్ష్మికి ఏడాది జైలు, రూ.1,500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. కాగా కేసులో దోషులకు శిక్షపడేలా పని చేసిన పోలీస్‌ అధికారులను ఎస్పీ సింధూశర్మ అభినందించారు.

మరిన్ని వార్తలు