ఆర్థిక లావాదేవీల వల్లే లైన్‌మన్‌ బంగార్రాజు హత్య

8 Nov, 2021 08:28 IST|Sakshi

హత్యకేసులో ముగ్గురి అరెస్ట్‌ 

ఇనుపరాడ్‌తో కొట్టి హత్యచేసిన కోరాడ గోవిందరావు 

డీసీపీ–1 గౌతమి సాలి వెల్లడి  

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గొట్టిపల్లి లైన్‌మన్‌ మొల్లి బంగార్రాజు (45) హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని డీసీపీ–1 గౌతమి సాలి చెప్పారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. విశాఖపట్నంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను ఆమె వెల్లడించారు. డీసీపీ–1 తెలిపిన మేరకు.. షిఫ్ట్‌ ఆపరేటర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని బంగార్రాజు మధ్యవర్తిగా రూ.30 లక్షల వరకు వసూలు చేసి కోరాడ గోవిందరావుకు ఇచ్చాడు.

రెండేళ్లవుతున్నా ఉద్యోగాలు రాకపోయేసరికి నిరుద్యోగులు నిలదీస్తుండటంతో బంగార్రాజు.. గోవిందరావుపై ఒత్తిడి తెచ్చాడు. బంగార్రాజు అడ్డు తొలగించుకుంటే బాధితులకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని భావించిన గోవిందరావు ఈ హత్య చేశాడు. శవాన్ని మాయం చేసేందుకు ఇద్దరికి రూ.లక్ష వరకు సుపారీ ఇచ్చాడు. ఈ ముగ్గుర్నీ పోలీసులు అరెస్టు చేశారు. 

హత్య జరిగింది ఇలా.
భీమునిపట్నం మండలం నమ్మివానిపేటకు చెందిన బంగార్రాజు అక్టోబర్‌ 31వ తేదీన ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. తరువాత అతడు ఇంటికి రాకపోవడంతో ఈనెల 3వ తేదీన అతడి భార్య నందిని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగార్రాజుతో ఎక్కువగా ఆర్థిక లావాదేవీలున్న కోరాడ గోవిందరావు, కోరాడ లక్ష్మణరావు, పైడిరాజు, వెంకటేశ్‌లపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో నార్త్‌ ఏసీపీ శ్రీనివాసరావు నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. అక్టోబర్‌ 31న కోరాడ గోవిందరావు ఒక్కరే హత్య జరిగిన ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు.

అక్టోబర్‌ 31న బంగార్రాజుకు గోవిందరావు ఫోన్‌చేసి రూ.2 లక్షలు ఇస్తానని, నిర్మాణంలో ఉన్న కోరాడ లక్ష్మణరావు గెస్ట్‌హౌస్‌కు వెంటనే రమ్మని చెప్పాడు. కూలీలంతా భోజనాలకు వెళ్లిన ఆ సమయంలో గోవిందరావు కరెంటు సరఫరా ఆపేసి సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశాడు. డబ్బుల కోసం వచ్చిన బంగార్రాజును ఇనుపరాడ్‌తో తలపై, వీపుపై కొట్టి చంపేశాడు. మృతదేహాన్ని దాచిపెట్టి బయటకు వెళ్లిన గోవిందరావు ఆది అనే వ్యక్తి మొబైల్‌ నుంచి ఫోన్‌ చేయడంతో పైడిరాజు, సంతోష్‌ వచ్చారు. మృతదేహాన్ని కనిపించకుండా చేస్తే రూ.లక్ష ఇస్తానని వారితో గోవిందరావు బేరం కుదుర్చుకుని అడ్వాన్స్‌గా రూ.7 వేలు ఇచ్చాడు.

సాయంత్రం 6 గంటల సమయంలో వారు మృతదేహాన్ని పద్మనాభం మండలం పాండ్రంగి పంచాయతీ ఏనుగులపాలెంలోని పొలంలోకి తీసుకెళ్లి రేకు కప్పి ఉంచారు. ఒకటో తేదీన బోని వాటర్‌ వర్క్స్‌ వద్ద బంగార్రాజు మోటార్‌ బైక్‌ లాక్‌ చేసి దాచారు. పొలం వెళ్లిన రైతులు దుర్వాసన రావడంతో పరిశీలించి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బంగార్రాజు మధ్యవర్తిగా వసూలు చేసిన రూ.30 లక్షలను గోవిందరావు వాడుకున్నట్లు డీసీపీ–1 తెలిపారు. కొందరి అప్పులు తీర్చినట్లు తేలిందని చెప్పారు. ఈ సమావేశంలో ఏసీపీలు సీహెచ్‌ శ్రీనివాసరావు, పెంటారావు, శ్రావణ్‌కుమార్, మూర్తి, శిరీష, సీఐలు పాల్గొన్నారు. 
 

మరిన్ని వార్తలు