మద్యం అలవాటు: ప్రాణం తీసిన ఆకు పసరు

27 Mar, 2021 09:32 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కదిరి: పసరు వైద్యం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఈ ఘటన శుక్రవారం ఎన్‌పీకుంటలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు.. వైఎస్సార్‌ కడప జిల్లా గాలివీడుకు చెందిన గంగరాజు కుమారుడు వేమల నారాయణ(38) కొంతకాలంగా ఎన్‌పీకుంటలోని ఓ కార్పెంటర్‌ వద్ద పనిచేస్తున్నాడు. మద్యానికి అలవాటు పడిన నారాయణ.. ఆ వ్యసనం నుంచి బయటపడాలని భావించాడు. ఈ క్రమంలోనే పులివెందుల సమీపంలోని సారాపల్లిలో మద్యం మానేందుకు పసరు వైద్యం చేస్తారని తెలిసి శుక్రవారం ఉదయం మరికొందరు మద్యం ప్రియులతో కలిసి అక్కడికి వెళ్లాడు.

వారిచ్చిన ఆకు పసరు మందు తాగి మధ్యాహ్నానికి ఎన్‌పీ కుంటకు చేరుకున్నాడు. సాయంత్రం 4 గంటలకు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించి చుట్టుపక్కల వారు 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా...మార్గమధ్యంలోనే నారాయణ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ నరసింహుడు ఈఘటనపై వివరాలు ఆరా తీసి కేసు నమోదు చేశారు. అలాగే నారాయణతో కలిసి పసరు వైద్యం చేయించుకున్న వారి వివరాలు సేకరించి వారిని ఆస్పత్రికి తరలించారు.
చదవండి: ‘ఆమె’గా వల.. న్యూడ్‌ వీడియోలతో బ్లాక్‌మెయిల్‌

మరిన్ని వార్తలు