900 కిమీ దూరం.. గంటల వ్యవధిలోనే చనిపోయిన కవల సోదరులు..

14 Jan, 2023 15:11 IST|Sakshi

న్యూఢిల్లీ: 900 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న కవల సోదరులు గంటల వ్యవధిలో ప్రాణాలు కోల్పోవడం ఓ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఇద్దరు కుమారులు చనిపోవడంతో తల్లిదండ్రులు షోక సంద్రంలో మునిగిపోయారు.

రాజస్థాన్‌కు చెందిన ఈ కవల సోదరుల పేర్లు సుమేర్ సింగ్, సోహన్ సింగ్. వయసు 26 ఏళ్లు.  సుమేర్ గుజరాత్‌ సూరత్‌లోని టెక్స్‌టైల్ సిటీలో పని చేస్తున్నాడు. సోహన్ గ్రేడ్-2 టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు సన్నద్ధమవుతూ జైపూర్‌లో నివాసముంటున్నాడు.

అయితే సుమేర్ బుధవారం రాత్రి కుటుంబసభ్యులతో ఫోన్లో మాట్లాడుతూ ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడి చనిపోయాడు. తల్లిదండ్రులు పిలవడంతో ఇంటికి వెళ్లిన సోహన్.. గురువారం వేకువ జామున నీళ్లు తెచ్చేందుకు 100 మీటర్ల దూరంలో ఉన్న ట్యాంకు వద్దకు వెళ్లాడు. ఎంతసేపటికి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు వెళ్లి చూడగా.. అతని మృతదేహం ట్యాంకులో కన్పించడంతో షాక్ అయ్యారు.

ఇద్దరు కుమారులు గంటల వ్యవధిలోనే మరణించడంతో తల్లిదండ్రులు విస్మయానికి గురయ్యారు. అయితే సోహన్ కాలుజారి వాటర్ ట్యాంక్‌లో పడిపోయాడా లేదా ఆత్మహత్య చేసుకున్నాడా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. దీనిపై విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కవలలకు మరో ఇద్దరు తోబుట్టువులు కూడా ఉన్నారు.
చదవండి: వృద్ధ దంపతులను నిర్బంధించి రూ. కోటి నగలు, డబ్బు చోరీ

మరిన్ని వార్తలు