చైనాకు పరారైన లోన్‌యాప్‌ డైరెక్టర్లు

19 Jan, 2021 10:31 IST|Sakshi

రెడ్ కార్నర్ నోటీసులు జారీ

భారత్‌కు రప్పించేందుకు పోలీసుల తీవ్ర ప్రయత్నాలు

సాక్షి, హైదరాబాద్ ‌: రుణాలు తీర్చినా తీవ్ర వేధింపులకు పాల్పడుతూ ప్రాణాలు తీసుకునేలాగా చేసిన లోన్‌ యాప్స్‌ నిర్వాహకులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే వారు పోలీసులకు చిక్కకుండా స్వదేశం చైనాకు పరారయ్యారు. చైనాకు వెళ్లిన లోన్ యాప్స్ కంపెనీల రెక్టర్లను తిరిగి రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. చైనాకు పారిపోయిన డైరెక్టర్ కోసం రెడ్ కార్నర్ నోటీసులు పోలీసులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో డైరెక్టర్లను పట్టుకునే ప్రయత్నాలు సైబర్ క్రైమ్ పోలీసులు చేస్తున్నారు. అయితే ఆ కంపెనీ నిర్వాహకులు పక్కా ప్లాన్‌తో ఈ వ్యవహారం నడిపించారు. భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసే వారు కూడా భారత్‌కు చెందిన వారిని డైరెక్టర్లుగా నియమించుకున్నారు. నేరం చేసినా తమ మీదకు రాకుండా ముందస్తు జాగ్రత్తలు పడ్డారు. ఆ విధంగా డైరెక్టర్లను నియమించుకున్న చైనా కంపెనీలు ఇప్పుడు వారి నేరాలు బహిర్గతమవడంతో వారు చైనాకు పారిపోయారు.

చైనాకు చెందిన కంపెనీలు భారత్‌కు చెందిన వారితో కంపెనీ నడిపిస్తున్న విషయం కేసుల నమోదు అనంతరం బయటపడింది. ఆ కంపెనీల భారీ ఆఫర్లు ఇవ్వడంతో భారత్‌కు చెందిన చాలామంది ఆశ పడి డైరెక్టర్లుగా చేరారు. ఇలాంటి 16 కంపెనీలపై ఇప్పటివరకు దాడులు చేసి పోలీసులు మూసివేశారు. అయితే చైనాకు పారిపోయిన ఈ కంపెనీ డైరెక్టర్లను పట్టుకుంటే అసలు విషయాలు బయటకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగా చైనాకు వెళ్లిన వారిని తిరిగి రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రుణాల యాప్స్‌ నిర్వాహకుల వేధింపులు భరించలేక దాదాపు 5 మంది బలవన్మరణానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. వందకు పైగా కేసులు నమోదయ్యాయి. దీనిపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు