లోన్‌ యాప్‌ వేధింపులు, సెల్ఫీ సూసైడ్‌!

25 Dec, 2020 14:11 IST|Sakshi

సాక్షి, పెద్దపల్లి: ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ మరో వ్యక్తి ప్రాణాలు తీసింది. అవసరానికి అప్పులు తీసుకున్న వ్యక్తిని అదే పనిగా వేధించడంతో బాధితుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు... విశాఖపట్నానికి చెందిన సంతోష్‌కుమార్‌ రామగుండంలోని ఓ ఎరువుల కర్మాగారంలో సైట్ ఇంచార్జిగా పనిచేసేవాడు. మల్కాపూర్‌లో ఇల్లు అద్దెకు తీసుకునే ఉండేవాడు. తన ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో సంతోష్‌ ఆర్థికంగా కుదేలయ్యాడు. దీంతో యాప్ లోన్ ద్వారా అప్పు తీసుకున్నాడు. వాటిని వాయిదాల ప్రకారం చెల్లించసాగాడు. అయితే, అసలు, వడ్డీ ఒకేసారి చెల్లించాలని సదరు యాప్‌ల నిర్వాహకులు వేధించసాగారు. అసలే ఆర్థికంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సంతోష్‌ వారి వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అఘాయిత్యానికి పాల్పడే ముందు అతను సెల్ఫీ వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ వీడియోను తన ఫ్రెండ్‌ సుబ్రహ్మణ్యంకు పంపించాడు.
(చదవండి: లోన్‌యాప్స్‌ కేసులో ఆసక్తికర విషయాలు)

అప్పులు తీసిన ప్రాణం
వెంటనే స్పందించిన సుబ్రహ్మణ్యం అతన్ని గోదావరిఖని ఆస్పత్రికి అక్కడి నుంచి కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. విశాఖపట్పం నుంచి వచ్చిన కుటుంబ సభ్యులు సంతోష్‌ను మెరుగైన వైద్యం కోసం వైజాగ్‌కు తీసుకువెళ్ళారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 23న మృతి చెందారు. సూసైడ్ సెల్ఫీ వీడియో ద్వారా సుబ్రహ్మణ్యం ఎన్టీపీసీ పోలీసులకు పిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం 5 లోన్‌ యాప్‌ల ద్వారా సంతోష్‌ రూ. 54 వేలు అప్పు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఉదాన్‌లోన్‌ యాప్‌, రుపీ లోన్‌ యాప్‌, రూపేలోన్‌ యాప్‌, ఎఎఎ-క్యాష్‌ లోన్‌ యాప్‌, లోన్‌గ్రాన్‌ యాప్‌లలో అతను అప్పుగా తీసుకున్నట్టుగా సమాచారం. ఆయా యాప్‌ల యాజమాన్యాలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అతని స్నేహితుడు సుబ్రహ్మణ్యం ఎన్టీపీసీ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టామని ఎన్టీపీసీ ఎస్సై స్వరూప్‌రాజ్‌ తెలిపారు. ఈ  ఘటన పెద్దపల్లి జిల్లాలో కలకలం సృష్టిస్తోంది.
(చదవండి: వేధింపులకు కొన్ని స్టేజ్‌లు..!)

మరిన్ని వార్తలు