పండుగ నాడు ఘోర విషాదం

4 May, 2022 11:07 IST|Sakshi

తుమకూరు: రంజాన్‌ పండుగ రోజు విషాదం చోటుచేసుకుంది. లారీ, కారు ఢీకొన్న దుర్ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన హులియూరు దుర్గ పోలీసు స్టేషన్‌ పరిధిలో రాష్ట్ర రహదారి– 33లో మంగళవారం జరిగింది. రామనగర జిల్లా చెన్నపట్టణకు చెందిన సయ్యద్‌ మహమ్మద్‌ నజ్మి (42), నాజియా (30), వారి పిల్లలు సైయద్‌ ఖుద్‌ మీర్‌ హసి (2), సైయద్‌ ఖుద్‌ మీర్‌ నబీ (3)లు రంజాన్‌ పండుగ కావడంతో భద్రావతిలోని బంధువుల ఇంటికి కారులో వెళుతున్నారు. కుణిగల్‌ తాలూకా  ప్యాలెస్‌ హోన్నమాచనహళ్లి వద్ద ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జు కాగా, దంపతులు, హసి మృతి చెందారు. మరో బాలుడు నబీకి తీవ్ర గాయాలు తగిలాయి. మృతదేహాలను ఆదిచుంచనగిరి ఆస్పత్రికి తరలించారు. బాలుని మృతదేహాన్ని తల్లి ఒడిలోనే ఉంచడం చూపరులను కలచివేసింది.  

నీటి గుంతలో పడి అక్కాచెల్లి మృతి 
మైసూరు: నీటి కుంటలో పడి అక్కాచెల్లెలు మృతి చెందిన సంఘటణ చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేట తాలూకా కుబ్బెపురలో మంగళవారం జరిగింది. రైతు రేచప్ప, వేదా దంపతుల కుమార్తెలు  పుణ్య (11) పూజా (13) మృతులు. తల్లిదండ్రులు పొలం పనిలో ఉండగా, బాలికలు ఆడుకుంటూ వెళ్లి ఒక ఫారంపాండ్‌లో పడ్డారు. లోతుగా ఉండడంతో బయటకు రాలేకపోయారు. వీరిలో పూజ 8వ తరగతి, పుణ్య 6వ తరగతి చదివేవారు. ఇద్దరు పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు.

(చదవండి: కారు పల్టీ, 8 మందికి గాయాలు)

మరిన్ని వార్తలు