ఆటోను ఢీ కొట్టి.. మహిళను ఈడ్చుకెళ్లి..

14 Jun, 2021 07:44 IST|Sakshi

సదాశివనగర్‌ (ఎల్లారెడ్డి)/కామారెడ్డి: అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, పదిమంది గాయపడ్డారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం పద్మాజివాడి గ్రామ శివారులో 44వనంబర్‌ జాతీయ రహదారిపై ఆదివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంగోజివాడి గ్రామానికి చెందిన గడ్డం మమత (32), గడ్డం లక్ష్మి(41)తో పాటు మరి కొందరు.. నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలం కులాస్‌పూర్‌ గ్రామంలో జరిగిన అంత్యక్రియలకు రెండు ఆటోలు, ఒక తుఫాన్‌ వాహనంలో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో పద్మాజివాడి గ్రామ శివారులోకి రాగానే వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ వీరు ప్రయాణిస్తున్న ఓ ఆటోను ఢీకొట్టింది.

దీంతో ఆటోలోనుంచి గడ్డం మమత రోడ్డుపై పడిపోగా, ఆమె తలపై నుంచి లారీ వెనుక టైర్లు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. లారీ డ్రైవర్‌ ఆపకుండా వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. అదే ఆటోలో ఉన్న గడ్డం లక్ష్మి లారీ వెనుక భాగంలో ఇరుక్కుపోగా, సుమారు రెండు కిలోమీటర్ల వరకు రహదారి వెంట ఈడ్చుకెళ్లడంతో ఆమె కూడా దుర్మరణం చెందింది. ప్రమాదంలో గాయపడిన ఆటో డ్రైవర్‌ చిన్న బాలయ్య, రాజయ్య, సాయవ్వలను నిజామాబాద్‌కు, ఆవునూరి రాజవ్వ, దోమకొండ లక్ష్మి, గడ్డం బాల్‌రాజ్, లక్ష్మిలను కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. లారీ డ్రైవర్‌ నేరుగా సదాశివనగర్‌ పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్‌.శేఖర్‌ తెలిపారు.

చదవండి: హైదరాబాద్: ముగ్గురు మహిళల అదృశ్యం కలకలం

మరిన్ని వార్తలు