వరసకు బాబాయ్‌! పెద్దలు ఒప్పుకోకపోవడంతో..

26 Dec, 2022 03:28 IST|Sakshi
మునికుమార్, అనిత 

కృష్ణ: వరసలు కలవకపోవడంతో తమ ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకోలేదని మనస్తాపానికి గురైన ఓ ప్రేమజంట రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడింది. నారాయణపేట జిల్లా కృష్ణ మండలం చేగుంటలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్‌ పరిధిలోని కందానాటికి చెందిన మునికుమార్‌ (25), పారుపల్లికి చెందిన అనిత (16)ల కుటుంబ సభ్యులు బతుకుదెరువు కోసం కుటుంబాలతో కలసి ఇటీవల కృష్ణ మండలంలోని చేగుంటలో పత్తి తీయడానికి వచ్చారు.

అదే ప్రాంతంలో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా మునికుమార్, అనిత ప్రేమించుకుంటున్నారు. అయితే మునికుమార్‌ అనితకు వరసకు బాబాయ్‌ అవుతాడు. వీరి విషయం తెలిసిన తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో తమ ప్రేమ ఫలించదని మనస్తాపానికి గురైన వారు ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.

ఈ విషయం రైల్వే గ్యాంగ్‌మెన్‌ గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి పంచనామా చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం మక్తల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు