పక్కా ప్లాన్‌తో అంగన్‌వాడీ సెంటర్‌ పక్కనే ఇల్లు అద్దెకు.. జెండా వందనం చేశాక...

16 Aug, 2022 20:45 IST|Sakshi
భర్త ప్రవీణ్‌తో శిరీష (ఫైల్‌)

చిగురుమామిడి(హుస్నాబాద్‌): ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. అనుమానమే పెనుభూతమై స్వాతంత్య్ర దినోత్సవం రోజు జెండా ఎగరవేశాక కత్తితో భార్య గొంతు కోసి, కడతేర్చాడు ఓ భర్త.. ఈ ఘటన చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామంలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. కేవపట్నం మండల కేంద్రానికి చెందిన అరెపల్లి రవి–యాదమ్మ దంపతుల పెద్ద కూతురు శిరీష. ఈమెకు ఒక తమ్ముడు ఉన్నాడు. 

ఇందుర్తికి చెందిన కనకం ప్రవీణ్‌ డిగ్రీ, శిరీష(27) ఇంటర్‌ చదివారు. చదువుకునే రోజుల్లోనే వీరికి పరిచయం ఏర్పడింది. ప్రవీణ్‌ ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పి, పెద్దల సమక్షంలో 2012లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు శరణ్య, కుమారుడు శశివర్దన్‌ ఉన్నారు. 2018లో శిరీష అంగన్‌వాడీ ఆయా ఉద్యోగానికి ఎంపికైంది. కొంతకాలం తన విధులను ఎలాంటి ఇబ్బందుల్లేకుండా నిర్వహించింది. ఈ క్రమంలో గత 6 నెలలుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ప్రవీణ్‌ నిత్యం శిరీషను అనుమానించేవాడు. విచక్షణారహితంగా కొట్టేవాడు. భరించలేని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. 
(చదవండి: వ్యభిచారం అంటూ హిజ్రాకు బెదిరింపులు.. ఎంతకూ మాట వినకపోవడంతో తోటి హిజ్రాలతో కలిసి..)

పెద్ద మనుషులు ఒక్కటి చేసినాగొడవలు ఆగలేదు.. 
నిత్యం గొడవలు పడుతున్న వీరిని పెద్ద మనుషులు ఒప్పించి, ఒక్కటి చేశారు. దీంతో కొన్ని రోజులు కలిసిమెలిసి ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ గొడవలు మొదలయ్యాయి. దీంతో శిరీష 2 నెలలుగా పుట్టింట్లోనే ఉంటోంది. కోర్టును ఆశ్రయించి, భర్త ప్రవీణ్‌కు విడాకుల నోటీసు పంపించింది. కేశవపట్నం పోలీస్‌స్టేషన్‌లోనూ అతనిపై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో 45 రోజులు అంగన్‌వాడీ విధులకు హాజరు కాలేదు. అధికారుల మందలింపుతో ఈ నెల 3 నుంచి తన తండ్రి రవిని వెంట తీసుకొని, కేశవపట్నం నుంచి బైక్‌పై అంగన్‌వాడీ సెంటర్‌కు వస్తోంది. 

అంగన్‌వాడీ సెంటర్‌ పక్కనే ఇల్లు అద్దెకు.. 
శిరీషను చంపాలని ప్రవీణ్‌ పథకం వేశాడు. ఇందుర్తిలో అతనికి ఇల్లు ఉన్నా అంగన్‌వాడీ సెంటర్‌ పక్కన మరో ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అవకాశం కోసం చూసిన ప్రవీణ్‌ స్వాతంత్య్ర దినోత్సవం రోజు తన పథకాన్ని అమలు చేశాడు. 

వివరాలు తెలుసుకుంటున్న సీఐ, ఎస్సైలు

చంపవద్దని బతిమిలాడినా వినలేదు 
సోమవారం స్వాతంత్య్ర వేడుకలకు వచ్చిన శిరీషను ప్రవీణ్‌ జెండా వందనం పూర్తయ్యాక మాట్లాడాలని పక్కకు తీసుకెళ్లాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతుపై దాడి చేశాడు. అడ్డుకోబోయిన ఓ యువకుడిపైనా అదే ఆయుధంతో దాడి చేసి, గాయపరిచాడు. తననేమీ చేయొద్దని శిరీష ఎంత బతిమిలాడినా వినకుండా ప్రాణాలు తీశాడు. 

ఆమె అరుపులు విన్న గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రవీణ్‌ను పట్టుకునేలోపే పారిపోయి, చిగురుమామిడి పోలీసులకు లొంగిపోయాడు. ఘటనాస్థలిని తిమ్మాపూర్‌ సీఐ శశిధర్‌రెడ్డి, చిగురుమామిడి ఎస్సై దాస సుధాకర్‌లు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కరీంనగర్‌ రూరల్‌ ఏసీపీ కరుణాకర్‌రావు ఆస్పత్రికి వెళ్లి, శిరీష మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె బంధువులతో మాట్లాడారు. మృతురాలి తండ్రి రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
(చదవండి: తమ్మినేని కృష్ణయ్య హత్య.. సంచలన నిజాలు వెల్లడించిన ప్రత్యక్ష సాక్షి)

మరిన్ని వార్తలు