ప్రియుడితో బాలిక అదృశ్యం.. స్నేహితులంతా సాముహికంగా..

8 Dec, 2021 10:44 IST|Sakshi

సాక్షి, సుల్తాన్‌బజార్‌(హైదరాబాద్‌): సుల్తాన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అదృశ్యమైన ఓ మైనర్‌ బాలిక పై ఐదుగురు దుండగులు లైంగికదాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన మేరకు.. సుల్తాన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివసించే ఓ మైనర్‌ బాలిక తన ప్రియుడితో కలిసి గత నెల 30న వెళ్లింది. దీంతో తల్లిదండ్రులు సుల్తాన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌లో నవంబర్‌ 30న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డిసెంబర్‌ 3న పోలీసులు బాలికను గుర్తించి  పోలీస్‌స్టేషన్‌కు తరలించగా... తనకు తెలిసిన స్నేహితులతో కలిసి ఇంటినుంచి బయటకు వచ్చినట్లు ఆమె తెలిపింది. అయితే ఐదుగురు కలిసి మేడిపల్లి ప్రాంతంలో పలుమార్లు అత్యాచారం జరిపారని మైనర్‌బాలిక పోలీసుల విచారణలో వెల్లడించింది.

మైనర్‌ బాలిక ఇచ్చిన సమాచారం మేరకు సుల్తాన్‌బజార్‌ పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. మరో నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

రహస్య జేబులో బంగారం 
శంషాబాద్‌:  అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం  కువైట్‌ నుంచి  జె9–1403 విమానంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చిన హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రయాణికుడిని కస్టమ్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

అతడి ప్యాంటుకు ఉన్న రహస్య జేబులో 233.20 గ్రాముల బరువు కలిగిన రెండు బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. వీటి విలువ రూ.11.49 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు