మూడు గంటల్లోనే పెళ్లి పెటాకులై..

27 Aug, 2020 11:58 IST|Sakshi

పెద్దల మాటకు ఎదురుచెప్పలేక పెళ్లి చేసుకున్న యువతి

బరాత్‌లో ఎంటరైన ప్రియుడు

అందరి ముందే ముద్దు పెట్టిన వైనం

వరుడి ఫిర్యాదుతో కేసు నమోదు

ప్రియుడితోనే ఉంటానన్న వధువు

కౌన్సిలింగ్‌ ఇచ్చి స్వధార్‌ హోంకు తరలింపు

సినిమాను తలపించే ట్విస్టులు

సాక్షి, కరీంనగర్/హుజురాబాద్‌ టౌన్‌‌: పెద్దల మాట కాదనలేకనో, సమాజంలో ఎదురయ్యే అవమానాలు భరించలేకనో మూడు ముళ్ళ బంధంతో ఏడు అడుగులు నడిచింది ఓ యువతి. కానీ అంతలోనే వరుడి జీవితంలో ఊహించని ట్విస్ట్‌ ఇచ్చింది. దీంతో వివాహమై మూడు గంటలు కూడా గడవకముందే పెళ్లి పెటాకులై.. ఆ వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. సినిమాలోని సీన్లను తలపించే ఈ ఘటన తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. హుజూరాబాద్‌కు చెందిన దివ్య వంశీ అనే యువకుడిని ప్రేమించింది. అయితే, తల్లిదండ్రుల మాట కాదనలేకనో లేదా బలవంతంగానో గానీ వారు కుదిర్చిన వివాహానికి అంగీకరించింది. దీంతో మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన ప్రవీణ్ ‌కుమార్‌కు ఇచ్చి బంధువుల సమక్షంలో సోమవారం రాత్రి పెళ్లి జరిపించారు. (చదవండి: మంచం మీద ప్రేమ పెళ్లి: కారణం ఏంటంటే?.)

అప్పటి దాకా అంతా బాగానే సాగింది. అయితే భాజా భజంత్రీల నడుమ అప్పగింతలు జరిగి ఊరేగింపు మొదలైన సమయంలో ప్రియుడు ఎంట్రీతో సీన్‌ మొత్తం రివర్స్‌ అయింది. మద్యం మత్తులో ఉన్న ప్రియుడు వంశీ సీన్‌లోకి ఎంటరయ్యాడు. ‘‘నీవు ఎలా పెళ్లి చేసుకున్నావు’’ అంటూ హంగామా సృష్టించాడు. నవ దంపతులు పెళ్లికూతురు ఇంటి నుంచి ఊరేగింపుగా బయలుదేరుతుండగా కారును అడ్డుకున్నాడు. పెళ్లికూతురిని కిందకి దింపి వరుడి ఎదుటే ఆమెకు ముద్దుపెట్టాడు. ఆమెను తనకప్పగించి వెళ్లిపోవాలని గొడవకు దిగాడు. ఇంకేముంది ఈ ఘటన చూసిన పెళ్ళికొడుకు బిత్తరపోయాడు. (చదవండి: మొన్న పెళ్లి.. నిన్న ప్రేమపెళ్లి.. రెండు రోజుల్లో రెండు పెళ్లిళ్లు)

వరుడి ఫిర్యాదు..  ప్రియుడితోనే ఉంటానన్న దివ్య
దీంతో పెళ్లింట ఆందోళన నెలకొంది. సీన్ పెళ్లి ఇంటి నుంచి పోలీస్ స్టేషన్‌కు మారింది. మద్యం మత్తులో వంశీ అనే యువకుడు తాను పెళ్లి చేసుకున్న అమ్మాయిని ప్రేమించానంటూ గొడవకు దిగడంతో చేయడంతో పాటుగా.. తనపై దాడికి యత్నించాడని వరుడు ప్రవీణ్‌కుమార్‌ ఫిర్యాదు చేశాడు. దీంతో వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు న్యూసెన్స్ కేసు నమోదు చేశారు. ఇక్కడ వరకు ఓ రకంగా ఉన్న సీన్‌.. దివ్య ఎంట్రీతో మరో మలుపు తిరిగింది. తన ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలియగానే.. తనకు పెళ్ళికొడుకు వద్దని ప్రియుడే కావాలని, అతనితోనే కలిసి ఉంటానని మరో ఫిర్యాదు చేసింది.  

ఈ నేపథ్యంలో వధూవరులకు రాత్రి వరకు కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ ఇరు వర్గాలు రాజీపడలేదు. దీంతో వధువును అక్కడే వదిలేసి వరుడు మందమర్రి వెళ్లిపోయాడు. మరోవైపు, తల్లిదండ్రులు కూడా కుమార్తెను పోలీస్ స్టేషన్‌లోనే వదిలిపెట్టి వెళ్లిపోయారు. పోలీస్ స్టేషన్‌లో ఒంటరిగా మిగిలిన వధువును పోలీసులు కరీంనగర్‌లోని స్వధార్ హోంకు తరలించారు. ఆమె ప్రియుడు వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు