ప్రేమించ లేదని.. కత్తితో పొడిచి.. నల్లగొండలో ప్రేమోన్మాది ఘాతుకం

10 Aug, 2022 11:23 IST|Sakshi

మాట్లాడాలని దగ్గరికి పిలిచి కత్తితో విచక్షణారహితంగా దాడి 

యువతికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రిలో చికిత్స 

కోలుకుంటున్న బాధితురాలు.. అదుపులో నిందితుడు 

నల్లగొండ క్రైం: తనను ప్రేమించడం లేదన్న అక్కసుతో ఓ యువతిపై ప్రేమోన్మాది విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. మాట్లాడుదామని పిలిచి అందరూ చూస్తుండగానే కత్తితో ఇష్టమొచ్చినట్టు పొడిచాడు. దగ్గరలోనే ఉన్న యువతి స్నేహితులు అది చూసి గట్టిగా అరవడంతో పారిపోయాడు. నల్లగొండ జిల్లా కేంద్రంలో మంగళవారం ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. కత్తిపోట్లకు గురైన యువతి ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కోలుకుంటోంది. 

స్నేహితులను కలిసేందుకు వెళ్లగా.. 
నల్లగొండ పట్టణ శివార్లలోని పానగల్‌కు చెందిన గుండెబోయిన నవ్య ఇక్కడి ఎన్జీ కాలేజీలో డిగ్రీ ఫైనలియర్‌ చదువుతోంది. పట్టణంలోని దేవరకొండ రోడ్డు ప్రాంతానికి చెందిన మీసాల రోహిత్‌ కూడా ఇదే కాలేజీలో డిగ్రీ సెకండియర్‌ చదువుతున్నాడు. కొంతకాలం నుంచి తనను ప్రేమించాలంటూ నవ్య వెంట పడుతున్నాడు. ఆమె తిరస్కరించడంతో కోపం పెంచుకున్నాడు.

మంగళవారం కాలేజీకి సెలవు ఉండటంతో నవ్య తన స్నేహితురాలు శ్రేష్ఠతో కలిసి మరో స్నేహితుడు తాయిని కలిసేందుకు పట్టణంలోని అటవీశాఖ కార్యాలయం వద్దకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న రోహిత్‌ బైక్‌పై అక్కడికి చేరుకున్నాడు. ఒకసారి మాట్లాడాలని నవ్యను దగ్గరికి పిలిచాడు. ఆమె దగ్గరికి రాగానే తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. అందరూ చూస్తుండగానే విచక్షణా రహితంగా పొడిచాడు. దీంతో నవ్య గొంతు, పొట్ట, పెదవులు, చెయ్యి మణికట్టు, కాలుపై తీవ్ర గాయాలయ్యా యి. నవ్య స్పృహ తప్పింది. అప్పటికే స్నేహితులు తాయి, శ్రేష్ఠ గట్టిగా అరవడంతో.. రోహిత్‌ బైక్‌ను అక్కడే వదిలేసి పారిపోయాడు. సమాచారం అందిన వన్‌టౌన్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన నవ్యను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. 

చంపుతానని ఇంతకుముందే బెదిరింపు 
తనను ప్రేమించకుంటే చంపేస్తానంటూ రోహిత్‌ గత నెల 27న నవ్య గొంతుపై పగిలిన బీరు సీసా పెట్టి బెదిరించినట్టు ఆమె కుటుంబ సభ్యులు చెప్తున్నారు. బాధితురాలి తండ్రి రామలింగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వన్‌ టౌన్‌ సీఐ రౌతు గోపి తెలిపారు. దాడి ఘటనపై ఎస్పీ రెమా రాజేశ్వరి ఆరా తీశారు. నిందితుడిని త్వరగా పట్టుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో పోలీసులు ముమ్మరంగా గాలించి ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా రోహిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

మరిన్ని వార్తలు