ప్రేమ వ్యవహారం: యువతి తల్లి ఫిర్యాదు.. ఆమె లేనిదే ఉండలేనని

2 Jul, 2021 21:18 IST|Sakshi
బాధ భరించ లేక ఇబ్బందులు పడుతున్న శ్రీనివాస్‌ (మధ్యలో ఉన్న వ్యక్తి)

పోలీస్‌స్టేషన్‌ ఎదుట ప్రేమికుడి ఆత్మహత్యాయత్నం

యువతి తల్లి ఫిర్యాదుతో మనస్తాపం 

పురుగు మందు తాగిన వైనం

మెరుగైన వైద్యం కోసం వికారాబాద్‌కు తరలింపు 

యాలాల: ప్రేమ వ్యవహారంలో మనస్తాపానికి గురైన యువకుడు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం మండల కేంద్రంలో కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని రాఘవపూర్‌కు చెందిన ధన్నారం శ్రీనివాస్‌ ఆటోడ్రైవర్‌. రెండేళ్లుగా అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు.

బుధవారం సాయంత్రం యువతితో మాట్లాడుతున్న శ్రీనివాస్‌ను యువతి తల్లి గమనించింది. ఈ మేరకు తన కూతురిని వేధిస్తున్నాడంటూ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో గ్రామ పెద్దలు ఇరు వర్గాలను నచ్చజెప్పేందుకు శ్రీనివాస్‌ను పీఎస్‌కు పిలిపించారు. అక్కడికి చేరుకున్న శ్రీనివాస్‌.. యువతి లేకుండా తాను ఉండలేనంటూ అరుస్తూ తన వెంట తెచ్చుకున్న పురుగు మందును తాగాడు.

గమనించిన పోలీసులు హుటాహుటిన బాధితుడిని తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం వికారాబాద్‌లోని మిషన్‌ ఆస్పత్రికి రెఫర్‌చేశారు. పీఎస్‌ ఆవరణలో పురుగుల మందు తాగిన ఘటనపై రూరల్‌ సీఐ జలంధర్‌రెడ్డి ఆరా తీశారు. ఎస్‌ఐ సురేష్‌ వికారాబాద్‌ మిషన్‌ ఆస్పత్రికి వెళ్లి శ్రీనివాస్‌ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు